ఫైబర్ నెట్ స్కాంలో ఏపీ సీఐడీ చార్జీషీట్
A 1 గా చంద్రబాబు, A 2గా వేమూరి హరి కృష్ణ పేర్లు దాఖలు
ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఏ1 గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు అయ్యింది. చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 114 కోట్లు నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 330 కోట్లు కాగా అందులో రూ. 114 కోట్లు చంద్రబాబు వల్ల నష్టం వాటిల్లిందని సీఐడీ అధికారులు ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని సీఐడీ చార్జ్ షీట్లో పేర్కొంది. వేమూరి హరి కృష్ణని నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా చంద్రబాబు నియమించారని తెలిపింది. ఉద్దేశ పూర్వకంగానే హరి కృష్ణని అప్పటి సీఎం చంద్రబాబు నియమించారని తెలిపింది. విధి విధానాలు లెక్కచేయకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌కు చంద్రబాబు ఇష్టారీతిలో అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను వేమూరి హరి కృష్ణకు అప్పగించేందుకు ప్రాజెక్ట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని సీఐడీ అధికారులు తెలిపారు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరి ప్రసాద్‌ను నియమించేందుకు చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది.
వేమూరి హరి కృష్ణ టేరాసాఫ్ట్ కంపెనీనీ బ్లాక్ లిస్ట్‌లో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టేరా సాఫ్టుకు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని తెలియజేసింది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసినా వాటిని లెక్కచేయకుండా వేమూరి హరి కృష్ణకు టెండర్ దక్కేలా చేసినట్లు తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే అతడిని చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. స్కాం ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హై కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ప్రస్తుతం చంద్రబాబు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన ఛార్జ్ షీట్లో పొందుపరిచింది.