అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం 2500 రకాల వంటకాలు.. హాజరు కానున్న ప్రపంచ కుబేరులు
ప్రపంచ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ఇప్పుడు వివాహ హడావుడి జరుగుతోంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లివేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. జులై 12వ తేదీన అనంత్ వివాహం జరగనుండగా మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్ లో ముందస్తు పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీకి వివాహం కుదిరిన విషయం తెలిసిందే.. ఈ ముందస్తు పెళ్లివేడుకలకు దేశంలోని అతిరథ మహారథులు ప్రముఖలు హాజరుకాబోతున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ఈ వేడుకలకు తరలిరానున్నారు. వీరి కోసం ఘుమఘమలాడే ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత పేరుగడించిన 25 మంది చెఫ్‌ల బృందం వంటలు చేసేందుకు వస్తోంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన వంటకాలు సహా ఇండోర్ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు.
మెక్సికన్ నుంచి జపనీస్ వరకు, పార్సీ నుంచి థాయ్ వరకు అన్ని రకాల వెరైటీలు సిద్ధం చేయబోతున్నారు. ఆసియన్ వంటలకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. అతిథులకు ఏమైనా స్పెషల్ వంటకం కావాల్సి వస్తే కూడా చిటికెలో చేసి ఇచ్చేలా వంటకాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అతిరథ మహారాజుల ఆహార అవసరాలకు గుర్తించి మెనూ సిద్ధం చేస్తున్నారు. అతిథులు జీవితంలో మర్చిపోలేని విధంగా రుచికరమైన పదార్థాలు అందించాలని యత్నిస్తున్నారు. ఇందు కోసం దాదాపు 2,500 రకాల వంటకాలను వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకరోజు వడ్డించిన వంటకాలు మరోరోజు వడ్డించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్పాహారం కోసమే 70 రకాల వంటకాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం లంచ్ కి, రాత్రి డిన్నర్ కు దాదాపు 250 రకాల చొప్పున రుచులను వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాఖాహార వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేయింబళ్లు మూడురోజులపాటు జరగనున్న ఈ వేడుకల కోసం అర్ధరాత్రి సమయంలో కూడా స్నాక్స్ అందించనున్నారు.
