Vegetables Cultivation With Drainage Water : హైదరాబాదీయులకు అలర్ట్.. మార్కెట్లో ఫ్రెష్ గా ఉన్నాయని కూరగాయలు కొనేస్తున్నారా?
ఏంతైనా సిటీ సిటీయే అని అనుకొని సిటీల్లోనే కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయని అనుకుంటారు. కానీ.. అసలు నిజం తెలిస్తే మీరు హైదరాబాద్ లో కూరగాయలు, ఆకుకూరలు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. పదండి ఎందుకో తెలుసుకుందాం.

హైదరాబాద్ లో ఉన్న దాదాపు అన్ని కూరగాయల మార్కెట్లలోకి వచ్చే కూరగాయలు, ఆకుకూరలు వేటితో పండిస్తున్నారో తెలుసా? మురుగునీటితో. మురుగునీరు అనగానే టెన్షన్ వచ్చేసింది కదా. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అసలు కూరగాయల పండించే తీరు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు కాలుష్యంతో, మురుగునీటితో నిండిపోయాయి.
ఆ నీటితోనే కూరగాయలు పండిస్తున్నారట. దీనిపై తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో ఆకుకూరలు, కూరగాయలు పండించే విధానాన్ని అడ్డుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ కూరగాయలు, ఆకుకూరలు తింటే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని కోర్టు తెలిపింది. అందుకే అలాంటి కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్ లోకి రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 13 చెరువులు ఉన్నాయి. అందులో అన్ని చెరువులు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. కాలుష్య కాటారాలుగా మారాయి. చెరువుల్లోకి డ్రైనేజీ నీరు, మురుగు నీరు, సెప్టిక్ ట్యాంక్ నీరు.. అన్నీ కలిసి చెరువులు మొత్తం దారుణంగా తయారవుతున్నాయి. దాని వల్ల చెరువుల్లోని చేపలు కూడా చనిపోతున్నాయి.
చెరువుల్లోకి మురుగునీరు, డ్రైనేజీ నీరు చేరకుండా అడ్డుకోవాలని కోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు.. అడ్వొకేట్ కమిషన్ నివేదిక సూచనలను అమలు చేయాలని.. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

చెరువుల్లో మురుగునీటి అడ్డుకట్ట కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక కూడా అందించాలని తెలిపింది. దాని కోసం చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆ నివేదికలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు వెల్లడించాలని కోర్టు తెలిపింది. వచ్చే నెల ఏప్రిల్ 29లోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండించే కూరగాయల సాగుపై 2007లో కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. అప్పటి నుంచి ఈ కేసు విచారణ దశలోనే ఉంది. తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మురుగునీటితో చేసే కూరగాయల సాగును వెంటనే ఆపించేయాలని కోర్టు స్పష్టం చేసింది.
