lemon lamp : ఒకప్పడు దోమలు పట్టణాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ దోమలు వీరవిహారం చేస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు డ్రైనేజీ వ్యవస్థ కేవలం పట్టణాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు పల్లెల్లోనూ డ్రైనేజీ సిస్టం ఉండడంతో పల్లే పట్నం అనే తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక వీటి నుంచి తప్పించుకోలేక జనం నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సైతం వీటిని నివారించేందుకు దోమల మందు కొడుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. వర్షాకాలంలోనే దోమలు ఉంటయనేది పాతకాలం మాట. ప్రస్తుతం ఎండాకాలంలోనూ వీటి బెడద పోవడం లేదు. దోమల నుంచి ఎలా కాపాడుకోవాలో అర్థం కాక జనం సతమతమవుతున్నారు. దోమల బారిన పడి డెంగీ, మలేరియా వంటి అనేక రోగాల బారిన పడుతున్నారు.
దోమల నుంచి రక్షణ పొందేందుకు దుకాణాల నుంచి దోమ తెరలు, జెట్ కాయిల్స్, దోమల బత్తీలు, ఆల్ అవుట్స్, గుడ్ నైట్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉపశమనం పొందుతున్నారు. అయితే వీటిని వాడినంత సేపు దోమలు ఇంట్లోకి రావడం లేదు. పదే పదే వీటిని వాడడం వల్ల అవి పనిచేయకుండా పోతున్నాయి. దీంతో తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ఇప్పుడు దోమలను తరిమికొట్టేందుకు సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి వాటి నుంచి ఇలా రక్షణ పొందుదాం.. దోమల బాధ నుంచి ఉపశమనం పొందేందుకు రోజూవాడే గృహోపకరణాల ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక నిమ్మకాయ, కొన్ని లవంగాలు, కొంత ఆవాల నూనె, కర్పూరం అవసరం అవుతాయి.
ముందుగా నిమ్మకాయను పదునైన చాకుతో పైభాగాన్నికత్తిరించాలి. ఆ తర్వాత నిమ్మరసం ఒక స్పూన్ సహాయంతో బయటకు తీసేయాలి. అనంతరం అందులో ఆవాల నూనె పోయాలి. అందులో కొన్ని లవంగాలు, కొంత కర్పూరం వేయాలి. ఇప్పుడు అగ్గిపెట్టె సహాయంతో దీపం వత్తులను వెలింగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఇంటి తలుపులను బిగ్గరగా మూసివేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దోమలు రావడాన్ని నియంత్రించవచ్చు. ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ కాబట్టి దోమలను నియంత్రించడంతోపాటు మనకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ చిట్కాను ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్న ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా నిమ్మకాయలను సగానికి కోసి అందులో లవంగాలు, కర్పూరం వేసి ఇంట్లో మీకు నచ్చిన చోట ఉంచితే కూడా దోమల బెడద తగ్గుతుంది. అంతేకాకుండా లవంగం నూనెను మీ శరీరానికి రాసుకుంటే దోమల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది.