Shreyas Iyer: మిగతా మూడు టెస్ట్ మ్యాచ్ లకు శ్రేయస్ దూరమైనట్లే!
Shreyas Iyer: న్యూఢిల్లీ : భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్ కారణంగా దూరమైన విషయం తెలిసిందే. ఇక అదే కోవలోకి శ్రేయస్ అయ్యర్ కూడా చేరినట్లు సమాచారం. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా తొలి టెస్ట్ అనంతరం విశ్రమించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా ఆటకు దూరమైనట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పితో పాటు గజ్జల్లో గాయం వేధిస్తున్నట్లు అతను జట్టు యాజమాన్యానికి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమస్యల దృష్ట్యా అతను మిగతా మూడు మ్యాచ్‌లలో ఆడడం అనుమానమే అని బీసీసీఐ అధికార ఒకరు మీడియాకు వెల్లడించారు. శ్రేయస్ అయ్యర్ గత ఏడాది వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానానికి దూరమయ్యారు.
చికిత్స చేయుంచుకుంటున్న నేపథ్యంలో ఆయన ఐపీఎల్ మ్యాచ్‌లకు సైతం దూరంగా ఉన్నాడు. కాగా ఈ మధ్యనే వన్డే ప్రపంచకప్ పోటీల్లో పునరాగంనం చేసిన శ్రేయస్ అద్భుత ప్రదర్శనతో రాణించిన విషయం తెలిసిందే. అతనికి మళ్లీ గాయాలు కావడం ఒక విధంగా క్రికెట్ అభిమానులను నిరాశపరిచినట్లు అవుతోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచాయి. ఇక మిగిలిన మ్యాచ్‌లకు ఇంకా సెలక్టర్లు క్రీడాకారులను ఎంపిక చేయాల్సి ఉంది. మూడో టెస్ట్ లోనూ విరాట్ కోహ్లీ ఆడేది కూడా అనుమానంగానే ఉన్నట్లు సమాచారం. మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి క్రీడాకారుల ఎంపికపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల బారిన పడడంతో సెలెక్టర్లకు జట్టును ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఒకటి రెండు రోజుల్లో సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. ఈనెల 15 నుంచి రాజ్ కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
