fire in Ujjain temple: మధ్యప్రదేశ్ ఉజ్జయినీ మహా కాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం
ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఓ వస్త్రానికి మంటలు అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నట్లు కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇండోర్ కు తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గౌర్ కూడా ఉన్నట్లు తెలియజేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆలయంలో హోలీ వేడుకలు కొనసాగుతుండగా ప్రమాదం సంభవించడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె త్రుటిలో బయటపడ్డారు.
కాగా ఆలయ సిబ్బంది, పూజారులు మాత్రమే ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందిస్తూ.. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. "ఈ ప్రమాదంలో గాయపడిన పూజారులను ఇండోర్, ఉజ్జెయిన్‌లోని హాస్పిటల్స్‌కి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు, బాధ్యులను కచ్చితంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు X లో పోస్ట్ చేశారు.