Ram Lalla Surya Tilak : బాల రాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని వీక్షించిన ప్రధాని మోదీ
ఉదయం నుంచే భారీ స్థాయిలో భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో సూర్యుడి కిరణాలను గర్భగుడిలో ఉన్న బాల రాముడి విగ్రహం నుదుటి మీద 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో కొన్ని నిమిషాల పాటు తాకాయి. దాని కోసం కుంభాకార, పుటాకార దర్పణాలు, కటకాలను ఏర్పాటు చేశారు.

గుడి పైభాగంలో సూర్యుడి కాంతిని గ్రహించేలా ఒక వస్తువును ఏర్పాటు చేసి అది ఒక పైపు ద్వారా ఆ కిరణాలను లోపలికి పంపిస్తుంది. అక్కడ ఉన్న కుంభాకార, పుటాకార దర్పణాలు స్వామి వారి నుదిటి మీద ఆ కిరణాలు ప్రసరించేలా చేశాయి. సరిగ్గా మధ్యాహ్నం 12.16 నిమిషాలకు బాల రాముడిని సూర్య కిరణాలు తాకాయి.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ అస్సాంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ర్యాలీ అనంతరం ప్రత్యేక విమానంలో లైవ్ లో సూర్య తిలకాన్ని వీక్షించారు.
ఈసందర్భంగా నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇలాంటి అద్భుత క్షణాన్ని చూసే అదృష్టం తనకు దక్కిందన్నారు. శ్రీరాముడి కృప వల్లనే అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగానని తెలిపారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇప్పటికీ తన కళ్ల ముందే కదలాడుతోందన్నారు. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏదో తెలియని కొత్త శక్తి తనకు వస్తున్నట్టు తెలిపారు.
ప్రత్యేక విమానంలో కూర్చొన్న మోదీ.. తన ట్యాబ్ లో శ్రీరాముడి సూర్య తిలకాన్ని లైవ్ లో వీక్షించారు. నల్బారీ ర్యాలీ తర్వాత తాను సూర్య తిలకాన్ని వీక్షించానన్నారు మోదీ. కోట్ల మంది భారతీయుల లాగానే తనకు కూడా ఇది ఒక భావోద్వేగ సమయం అన్నారు. సూర్య తిలకం మనకు శక్తిని ప్రసాదించి మన దేశానికి స్ఫూర్తి నింపాలన్నారు.
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహానికి జనవరి 22న ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 3.30 కే అయోధ్యలో దర్శనం ప్రారంభం కాగా.. అయోధ్య నగరంలో దాదాపు 110 ఎల్ఈడీ లైట్లను అమర్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.