Sri Rama Navami 2024 : భద్రాద్రి ఆలయంలో అంగరంగ వైభవంగా జగత్కల్యాణం.. అయోధ్యకు పోటెత్తిన భక్తజనం..
తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రధాన ఘట్టం జరుగుతోంది. శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఉదయం 10.30 కు మిథిలా మైదానంలో వైభవోపేతంగా జరగనుంది. సీతారాముల కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాచలానికి తరలి వెళ్తున్నారు.

ఇవాళ ఉదయం 8 నుంచి 9 వరకు ధ్రువమూర్తుల కల్యాణాన్ని నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి 12.30 వరకు కల్యాణ క్రతువు నిర్వహించనున్నారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. భద్రాద్రి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న బాలరాముడిని దర్శించుకునేందుకు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నేడు బాలరాముడి నుదుటన సూర్యతిలకం పడనుంది. దాని కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్యతిలకం పడగానే బాలరాముడిని దర్శించుకోనున్నారు.
బాలరాముడి సూర్యతిలకాన్ని వీక్షించేందుకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉదయం నుంచి బాలరాముడికి పలు పూజలు నిర్వహించారు.
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి శ్రీరామనవమి వేడుకలను అయోధ్యలో నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో అయోధ్యకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తొలి శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బాలరాముడికి ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన అభిషేకాలను పూజారులు నిర్వహిస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ మారుమోగుతున్నారు. హర్యానాలోని పంచ్ కులలో ఉన్న మాన్సా దేవీ ఆయలంలో రామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.
జమ్ముకశ్మీర్ లోని వైష్ణో దేవీ ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.
శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. పూరీ బీచ్ లో ఇసుకతో శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశాడు. శ్రీరాముడి విగ్రహాన్ని చూసేందుకు టూరిస్టులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.