UPSC 2023 Topper : ఫస్ట్ ర్యాంక్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాత్సవ
సివిల్స్ 2023 లో ఫస్ట్ ర్యాంక్ ఆదిత్య శ్రీవాస్తవకు వచ్చింది. అనిమేశ్ ప్రధాన్ కు రెండో ర్యాంకు వచ్చింది. మూడో ర్యాంకును మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్యరెడ్డి సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 30 మంది ఉన్నారు.
నిరంతరం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయడం వల్లనే ఇది సాధ్యం అయిందని శ్రీవాత్సవ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నాకు టాప్ 70 లోపు ర్యాంక్ వస్తుందని అనుకున్నా. 70 లోపు ర్యాంక్ వస్తేనే ఐఏఎస్ కు అర్హత సాధిస్తారు. అందుకే టాప్ 70 లో నా ర్యాంక్ ఉండాలని ఆ దేవుడిని వేడుకున్నా. కానీ.. నాకు టాప్ ర్యాంక్ వచ్చింది. ఎప్పటికప్పుడు నా తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించా. నా మెంటర్స్, నా సీనియర్స్.. వీళ్ల గైడెన్స్ వల్లనే నాకు ఈ రోజు టాప్ ర్యాంక్ వచ్చింది అని ఆదిత్య తెలిపారు.
సివిల్స్ లో విజయం సాధించాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. నిరంతర సాధన చేయాలి. అదే సివిల్స్ లో విజయానికి కీ అని స్పష్టం చేశారు. నిరంతర సాధన, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. ఈ మూడు ఏ రంగంలో అయినా విజయం సాధించడానికి పునాదులు అని ఆదిత్య అన్నారు.
మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సుల వల్ల, ఆదిత్య హార్డ్ వర్క్ వల్లనే ఇది సాధ్యం అయింది. ఆదిత్య తండ్రి కూడా ఎప్పుడూ ఆదిత్యను సివిల్స్ ప్రిపరేషన్ లో ప్రోత్సహించేవారు.. అని ఆదిత్య తల్లి ఆభా శ్రీవాత్సవ తెలిపారు.
మా మనవడు ఎప్పుడూ అన్నింట్లో టాపరే. మాకు ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. సివిల్స్ లోనూ టాపర్ అవడంతో చాలా సంతోషంగా ఉంది.. అని ఆదిత్య తాత శివరామ్ శ్రీవాత్సవ అన్నారు. ఈ దేశంలోనే జాతీయ స్థాయిలో నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు.. అని ఆదిత్య తండ్రి అజయ్ అన్నారు.
సివిల్స్ పరీక్షలను ప్రతి సంవత్సరం యూపీఎస్సీ నిర్వహిస్తుంది. మూడు ఫేజ్‌లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మూడింట్లో ప్రతిభ కనబరిచిన వాళ్లకే టాప్ ర్యాంక్ దక్కుతుంది. ప్రతి సంవత్సరం వెయ్యి మంది వరకు మాత్రమే సివిల్స్ లో ర్యాంక్స్ సాధిస్తుంటారు.
కానీ.. సివిల్స్ పరీక్షలను ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రాస్తుంటారు. సివిల్స్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసుల్లో అధికారులను యూపీఎస్సీ కమిటీ సెలెక్ట్ చేస్తుంటుంది.