Brazil Rains : బ్రెజిల్‌లో భారీ వరదలు.. 100 మంది మృత్యువాత.. నిరాశ్రయులైన లక్షల మంది
ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ సేవలు అన్నీ నిలిచిపోయాయి. సౌత్ బ్రెజిల్ లోని రియో గ్రాండే దోసుల్ అనే రాష్ట్రంలో గత వారం నుంచి కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. 15 వేల మంది సైనికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. పోర్టూ అలెగ్రే నగరం పూర్తిగా మునిగిపోయింది.

దీంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు గవర్నర్. ప్రజలు వెంటనే శిబిరాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే.. గైబా నది భారీ వరదలకు తట్టుకోలేకపోతోంది. గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గైబా నది ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని.. నది తీర ప్రాంతాలు, ఆనకట్టల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Brazil Rains : ఇళ్లు వదిలేసి పారిపోయిన 2 లక్షల మంది
ఏప్రిల్ 29 నుంచి బ్రెజిల్ ను వర్షాలు ముంచెత్తాయి. అప్పటి నుంచి కంటిన్యూగా పడిన వర్షాలకు రియో గ్రాండె దోసుల్ అనే రాష్ట్రం అతలాకుతలం అయింది. రాష్ట్రంలో ఉన్న 497 పట్టణాల్లో 414 పట్టణాలు వరదలకు తీవ్ర నష్టపోయాయి.
ఆ పట్టణాల్లోని ప్రజలంతా ఎక్కువగా వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తున్నారు. అవన్నీ అర్జెంటినా, ఉరుగ్వే దేశాలకు బోర్డర్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 904 మిలియన్ డాలర్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రజల ఇండ్లు, రోడ్లు, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, ఇతర వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయి. ఒక్క వారంలోనే రాష్ట్రంలో 5 నెలల్లో కురవాల్సిన వర్షం కురిసింది. అందుకే రాష్ట్రం ఒక్కసారిగా అతలాకుతలం అయింది. రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి.