Russia President Elections : మరోసారి పుతిన్‌కే పట్టం కట్టిన రష్యా ప్రజలు.. ముగిసిన పోలింగ్.. 88 శాతం ఓట్లు పుతిన్‌కే
Russia President Elections : రష్యాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారమే ఎన్నికలు ముగిశాయి. ఈసారి కూడా అధ్యక్షుడి రేసులో వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడిగానూ పుతిన్ ఉన్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఓటింగ్ కు ఆదివారంతో తెర పడింది. ఈసారి చాలామంది ఓటర్లు ముందుకొచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
రష్యాలో పుతిన్ ఎంత చెబితే అంతే. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడం కానీ.. ఇతర దేశాలతో పుతిన్ ప్రవర్తించే విధానం, రష్యా విదేశాంగ విధానం.. వీటన్నింటినీ రష్యా ప్రజలు కూడా స్వాగతించారు. అందుకే రష్యాలో పుతిన్ ఏది చెబితే అది అన్నట్టుగా తయారైంది. అందుకే మరోసారి 88 శాతం మంది ప్రజలు ఆయనకు మద్దతు పలికారు.
ముగ్గురు టోకెన్ అభ్యర్థులు మాత్రమే ఆయనకు పోటీగా అధ్యక్ష బరిలో నిలిచారు. అయితే.. ఆ ముగ్గురిలో ఎవ్వరు కూడా ఉక్రెయిన్ వార్ ని మాత్రం వ్యతిరేకించలేదు. అంటే.. రష్యాలో పుతిన్ అవలంభిస్తున్న విధానాలు, ఉక్రెయిన్ తో యుద్ధం తదితర అంశాలపై రష్యా ప్రజలంతా పాజిటివ్ గానే ఉండటంతో ఈసారి కూడా పుతిన్ కు భారీగానే మెజారిటీ లభించింది.
మరోవైపు ఉక్రెయిన్ మిసైల్స్ రష్యాను ఓవైపు దాడి చేస్తూనే ఉన్నా.. మరోవైపు ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది.. ఉక్రెయిన్ మిసైల్స్, డ్రోన్స్ దాడిలో పలువురు రష్యా ప్రజలు మృత్యువాత పడ్డారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగిన పోలింగ్ లో చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి.
పుతిన్ కు పోటీగా దిగాలని అనుకున్న ప్రతిపక్షనేత అలెక్సెయి నవాల్నీ గత నెలలోనూ జైలులో మరణించిన విషయం తెలిసిందే. నవాల్నీ కూడా చనిపోవడంతో, బరిలో లేకపోవడంతో రష్యా ప్రజలకు మరో గత్యంతరం లేక పుతిన్ నే మరోసారి ఎన్నుకోవాల్సి వచ్చింది.
అలెక్సీ నవాల్నీ భార్య యులియా కూడా రష్యన్ ఎంబసీలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. దాదాపు 5 గంటలు క్యూలో నిలబడి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్న యులియా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బాలెట్ మీద తన భర్త పేరు రాసినట్టు పేర్కొంది.
మరోవైపు పోలింగ్ ను ఆపేయాలని.. పుతిన్ కు వ్యతిరేకంగా చాలామంది ఆందోళనలు చేసే ప్రయత్నం చేశారు. కానీ.. పోలీసులు వాళ్లను వెంటనే నిలువరించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ తో సహా 16 సిటీల్లో 65 మంది రాజకీయ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం, శనివారం అంతగా పోలింగ్ సందడి కనిపించకపోయినా.. పోలింగ్ చివరి రోజు ఆదివారం మాత్రం ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. మరోవైపు నావల్నీ మద్దతు దారులు పోలింగ్ కేంద్రాల వద్ద అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. పుతిన్ విధానాలను వ్యతిరేకించే వారు.. పోలింగ్ కేంద్రాల వద్ద సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఈనేపథ్యంలోనే పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి.