రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నేటితో రెండేండ్లు కావస్తోంది. వేలాదిమంది సైనికులు, సాదారణ ప్రజలు ఈ యుద్దంలో పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ నిల్వలు కరిగిపోతున్నాయి. ఇండ్లు, భవనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులైన కార్యాలయాలు పేకమేడల్లా కుప్ప కూలిపోయాయి. ఎన్నో వేల కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. శరణార్థులు, అనాథలుగా మారిన కుటుంబాలు లెక్కేలేవు. ఎన్న ఏళ్ల నుంచి కష్టపడి కూడబెట్టిన ఆస్తులు తమ కళ్లముందే నాశనం అయ్యాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. అయినా- ఆ విధ్వంసకాండకు ఇంకా పుల్‌స్టాప్ పడలేదు. ప్రపంచ దేశాలు హెచ్చరించినా రష్యా పెడచెవిన పెట్టింది. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కూడా చేతులెత్తేస్తుండడంతో ఈ సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో మాత్రం కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య ప్రతీకారం పెరుగుతుందే గానీ తగ్గే ఆలోచనల వైపు కన్పించడంలేదు. ఇంకా మున్ముందు ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతోందో ఊహించుకుంటేనే ఒల్లు గగుర్పొడుచుకుంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శనివారం నాటికి రెండేళ్లు పూర్తిచేసుకుంది. ఇక మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నా కూడా తరుణంలో రష్యా తమ దూకుడును పెంచడం, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించడం చూస్తుంటే పరిస్తితులు మరింత ఘొరంగా మారే ప్రభావం కన్పిస్తోంది.

ఉక్రెయిన్ దేశం నాటో కూటమిలో చేరడాన్ని తీవ్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు ఆగ్రహం తెచ్చిపెట్టింది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తమ దేశ సరిహద్దుల దాకా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోందనేది ఆయన వాదన. దీంతో ఉక్రెయిన్ ను నాటో దేశంలో భాగస్వామ్యం చేసుకోవాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని పుతిన్ పలుమార్లు ఉక్రెయిన్‌కు హెచ్చరించారు. అయినా ఆదేశాధ్యక్షుడు జెలెస్కీ ససేమిరా అనడంతోనే అసలు యుద్ధానికి అడుగులు పడ్డాయి. రష్యా అహంకారానికి ప్రపంచ దేశాలు వ్యతిరేకించినా యుద్ధం మాత్రం ఆపలేదు. తూర్పు ఉక్రెయిన్ లోని రష్యన్ భాష మాట్లాడే డాన్బాస్ ప్రాంతం వారిపై ఉక్రె యిన్ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు పాల్పడుతోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే 2022 ఫిబ్రవరి 24న 'ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్' పేరుతో రష్యా యుద్ధానికి తెరలేపింది. డాన్బాస్ విమో చనం, నాజీయిజం అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగింది. కేవలం వారం రోజుల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటుందని రష్యా యుద్ధం ఆరంభించినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ రెండేండ్లు పూర్తయినా రష్యా కల నేరవేరలేదు. రష్యాతో పోల్చితే అతి చిన్న దేశమైన ఉక్రెయిన్ పోరాట పటిమను మనం మెచ్చుకోవాల్సిందే. ఉక్రెయిన్ సైన్యం రష్యాకు ఏమాత్రం తలొగ్గకపోవడం ప్రపంచ దేశాలకు స్పూర్తినిస్తోంది. తాజాగా రష్యా దాడులను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోగా ఈ నెల 17 అవవ్కా నగరాన్ని పుతిన్ సైన్యం తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, షాహిద్ డ్రోన్ల సహాయంతో రష్యా దాడులకు పాల్పడుతూ ఉక్రెయిన్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. త్వరలోనే ఉక్రెయిన్ భూభాగంపైకి పుతిన్ సేనలు విరుచుకుపడే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. ఉత్తర, తూర్పు, దక్షిణ సరిహద్దుల నుంచి దాదాపు 2 లక్షలమంది సైన్యాన్ని ఉక్రెయిన్ పైకి పంపింది.
రెండేండ్ల యుద్ధంలో ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే రష్యా ఆధీనంలోకి వచ్చింది. కాగా ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఈ రెండేండ్ల పాటు కొనసాగిన యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది క్షతగాత్రులు, ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 12వేల మంది అమాయక ఉక్రెయిన్ ప్రజలు యుద్ధానికి బలయ్యారు. 20వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. దాదాపు కోటి మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలు నిర్వాసితులయ్యారు. దాదాపు 60 లక్షలకు మంది పైగా విదేశాలకు శరణార్థులుగా వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం, శరణార్థులుగా మారడం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి తెగపడిన రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు శుక్రవారం మరిన్ని ఆంక్షలు విధించాయి. రష్యా సహా దానికి సానుకూలంగా ఉన్న దేశాలకు 500లకు పైగా ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య కొనసాగే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది.