DIOT Syndrome : ఏంటి ఈ ఇడియట్ సిండ్రోమ్? ఇంటర్నెట్ వైద్యం మీద నేటి యూత్ ఎందుకు ఆధారపడుతోంది?
ప్రస్తుతం మనం ఏ జనరేషన్ లో ఉన్నాం అంటే టెక్నాలజీ యుగంలో ఉన్నాం అంటాం. టెక్నాలజీ అంటే మామూలు గీమూలు టెక్నాలజీ కాదు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా.. టక్కున క్షణాల్లో మన ముందు ఉంచే ఏఐ యుగంలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో మనం ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో మన ముందు ఉంటోంది.
అలా ఇంటర్నెట్ నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా తెలుసుకునే జనరేషన్ ఇది. అయితే.. ఇంటర్నెట్ లో ఉండే సమాచారం మొత్తం నూటికి నూరు శాతం కరెక్ట్ గా ఉంటుందా? దాని జెన్యూనిటీ ఎంత అంటే మాత్రం చెప్పలేం. అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని ఇంటర్నెట్ లో చూసి నమ్మేదెలా? వైద్య రంగానికి చెందిన సమాచారాన్ని ఇంటర్నెట్ లో చూసి నమ్మొచ్చా?
కానీ.. కొందరు మాత్రం తమ ఆరోగ్యంపై పదే పదే ఇంటర్నెట్ లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటారు. తమ ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతూ.. తుమ్ము వచ్చినా.. దగ్గు వచ్చినా కూడా టెన్షన్ పడుతూ.. ఆరోగ్యంపై ఆందోళన చెందుతుంటారు కొందరు. దాన్నే ఇడియట్ సిండ్రోమ్ అంటారు.
IDIOT Syndrome : ఇడియట్ అనే పేరు ఎందుకు పెట్టారు?
ఇడియట్(IDIOT) అంటే ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ ట్రీట్మెంట్ అని అర్థం. దాన్నే ఇడియట్ అని షార్ట్ గా పిలుస్తారు. అంతే కానీ.. ఇంగ్లీష్ వర్డ్ ఇడియట్ కు, ఈ ఇడియట్ కు సంబంధం లేదు. దీన్నే వైద్య భాషలో సైబర్ కాండ్రియా అని అంటారు.
కొందరు తమకు ఏదైనా వ్యాధి వచ్చినట్టు అనిపిస్తే.. లక్షణాలు కనిపించగానే దాని గురించి ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తుంటారు. ఆ వ్యాధి సింప్టమ్స్ ఏంటి? ఆ వ్యాధి ఏంటి? దాని కోసం ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకోవాలి అని అన్నీ తామే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ కూడా డాక్టర్ ను సంప్రదించకుండా చేసుకుంటూ ఉంటారు.
ఇంటర్నెట్ లో లభించే సమాచారం మొత్తం జెన్యూన్ అనుకుంటే పొరపాటే. అందులో తప్పులు కూడా ఉండొచ్చు. వైద్య రంగానికి చెందిన చాలా డేటా ఇంటర్నెట్ లో ఉంటుంది కానీ.. దానిలో నిజమెంత అంటే చెప్పడం కష్టమే.
కానీ.. ఈ సిండ్రోమ్ తో బాధపడేవాళ్లు మాత్రం ఇంటర్నెట్ లో దొరికే సమాచారమే నిజం అనుకొని అందులో ఉన్నట్టుగానే సొంతంగా ట్రీట్ మెంట్ చేసుకుంటారట. అసలు వాళ్లకు ఆ వ్యాధి లేకున్నా.. ఉన్నట్టుగా ఊహించుకొని ట్రీట్ మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారట.
ప్రస్తుతం చాలామందిలో ఈ సిండ్రోమ్ ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అసలు నిజంగా ఆరోగ్య సమస్య ఉందా? లేదా? అనేది తెలుసుకోకుండా ఇంటర్నెట్ లో దొరికే సమాచారంతో సొంతంగా చికిత్స చేసుకుంటే అది మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.