కనీస మద్దతు ధర కొనుగోలుకు కేంద్రం హామీ
ఢిల్లీ శివారులో రైతులు చేపట్టిన ఆందోళనలతో సత్ఫలితాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివారులో రైతులు చేపట్టిన ఆందోళనలతో కేంద్రం దిగివచ్చింది. రైతులు తమ డిమాండ్లలో కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఐదేళ్లపాటు పలు రకాల పంటలను కనీస మద్దతు ధర(MSP)కు కొనుగోలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమవారం వెల్లడించారు. ఢిల్లీ చలో పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన నాలుగో విడత చర్చల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి రైతు నేతలతో కేంద్రం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల తరఫున ఈ చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఈ చర్చలు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు వరకు జరిగాయి.
సమావేశం అనంతరం పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. రైతులతో చర్చించిన అనంతరం ఐదేళ్లపాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని ప్రకటించారు. మినుములు, మైసూర్ పప్పు, కందులు, మొక్కజొన్న పండించే రైతులతో ఎన్‌సీపీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయన్నారు. కొనుగోళ్లపై ఎటువంటి పరిమితి ఉండదన్నారు. ఇందుకోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా పంజాబ్‌లో వ్యవసాయానికి మరింత రక్షణ చేకూరుతుందన్నారు. భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని, సాగు భూములు సిస్సారంగా మారకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు ఉంటాయని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు.
మరో రెండు రోజుల్లో తమ మిగతా డిమాండ్లు కూడా పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరతోపాటు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, నిరసనకారులపై పోలీసు పెట్టిన కేసులను ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.. ప్రస్తుతానికి కేంద్రం కనీస మద్దతు ధరకు మాత్రమే అంగీకరించింది. మిగతా అంశాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఆమోదించడంతో రైతులు ప్రస్తుతానికైతే తమ ఆందోళనను విరమించనున్నారు. తమ డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే ఈ నెల 21న పాదయాత్ర తిరిగి పునఃప్రారంభిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.