PM Kisan Mandhan Yojana : రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పింఛన్.. ఈ పథకం గురించి తెలుసా..?
రైతులకు పంటనష్టం సంభవిస్తే నష్టపరిహారాన్ని చెల్లిస్తుంటాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సైతం సబ్సిడీ ధరలకు అందిస్తూ రైతులకు ప్రభుత్వాలు అండగా నిలుస్తుంటాయి. అయితే ఈ పథకాలన్నీ సాగు చేసే రైతులకు మాత్రమే అందుతుంటాయి. మరి 60 ఏండ్లు దాటిన తర్వాత రైతుల పరిస్థితి ఏంటి?.. వారిని ఎవరు పోషించాలి అనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వారికోసం ఈ సంక్షేమ పథకాన్నిప్రవేశపెట్టింది.
ఇందుకోసం ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన పథకం ద్వారా 60 ఏండ్లు దాటిన తర్వాత రైతులకు ప్రతి నెలా రూ. 3000 పింఛన్ అందించనుంది. ఈ సంక్షేమ పథకం పూర్తి వివరాలు తెలుసుకుని రైతులందరూ ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన పథకం ద్వారా కేవలం రైతులు మాత్రమే లబ్ధి పొందుతారు. 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉన్న రైతులు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ భూరికార్టుల్లో పేరు ఉండి, పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలి. రెండు హెక్టార్ల వరకూ సాగు చేయదగిన భూమి ఉండాలి. ఇప్పటి వరకు 19.47 కోట్ల మంది రైతులు ఈ పథకంలో చేరారు.
అయితే తమ పేరు మీద ప్రభుత్వ రికార్డుల్లో తమ పేరు ఉన్నప్పటికీ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న రైతులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్సీఎస్), ఈఎస్ఐ , ఈపీఎఫ్‌వో వంటి పథకాలలో రిజిష్టర్ చేయించుకున్న రైతులు ఈ పథకాని అనర్హులుగా కేంద్రం ప్రకటించింది.
ఈ పథకంలో చేరే రైతులు ప్రతినెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరిన రైతు నెలకు రూ. 55 ప్రీమియం, 40 ఏళ్ల వయసులో చేరిన రైతు నెలకు రూ. 200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏండ్ల వయసు నిండిన తర్వాత రైతుకు ప్రతి నెలా రూ. 3000 వరకూ పింఛన్ అందించనుంది. ఒకవేళ ఆ రైతు చనిపోతే అతని భార్యకు ప్రతినెలా రూ.1500 పింఛన్ వర్తిస్తుంది.
ఈ పథకంలో 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, వయస్సుకు సంబంధించిన సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, భూమి పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, ఫోన్ నెంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు దరఖాస్తు సమయంలో సమర్పించాలి.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతులు కనీసం 5 ఏండ్లు ప్రీమియం చెల్లించాలి. ఒక వేళ రైతు చనిపోతే ఆయన భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. రైతు కనీసం ఐదేండ్ల వరకు నిర్ధేశిత తేదీ వరకు తన ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. వయసు నిండిన తర్వాత రైతు మృతి చెందినట్లయితే అతని భార్యకు సగం పింఛన్ (నెలకు రూ.1500) అందజేస్తారు.