LPG Price : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధర.. ఎంతో తెలుసా?
వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్లను ఎక్కువగా హోటల్లు, రెస్టారెంట్లలో వాడుతారు. అవి 19 కిలోల గ్యాస్ బరువును కలిగి ఉంటాయి. ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.30.50 తగ్గింది. అంటే.. తగ్గిన ధర ప్రకారం చూస్తే రూ.1764.50 కు ధర చేరుకుంది. ఈ ధర కేవలం ఢిల్లీలో ఉంటుంది. తగ్గిన ధరలు రాష్ట్రాల ప్రకారం మారుతూ ఉంటాయి. హైదరాబాద్ లో చూసుకుంటే రూ.32.50 ధర తగ్గింది.
గత మార్చి నెలతో పాటు ఫిబ్రవరి నెలలోనూ ధరలు వరుసగా రెండు సార్లు పెరిగాయి. రెండు సార్లు పెరిగిన తర్వాత ఈసారి ధరలను ఏప్రిల్ 1న తగ్గించారు. అయితే.. కొత్త సంవత్సరం సందర్భంగా 2024 మొదట్లో రూ.39.50 ను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. అది కూడా 19 కిలోల కమర్షియల్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ మీదనే. ఆ తర్వాత రెండు సార్లు ఫిబ్రవరి, మార్చిలో పెంచి ఇప్పుడు ఏప్రిల్ 1న తగ్గించారు.
గత నెలలో ఉన్న సగటు అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ధరలను పున:సమీక్షిస్తుంటాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరల్లో మార్పులు, ట్యాక్స్ పాలసీలో మార్పులు, సప్లయి, డిమాండ్ కంట్రిబ్యూషన్స్ లో సర్దుబాటు కారణంగా ఇవాళ ధరల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
మార్చి 1న పెరిగిన ధరలు రూ.25 కాగా.. ఇప్పుడు రూ.30.50 మేర తగ్గాయి. అయితే.. ఈ నెలలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలను ప్రభుత్వం తగ్గించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గత నెలలో గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధర కూడా రూ.100 తగ్గిస్తున్నట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఏప్రిల్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ అయిల్ కంపెనీలు ప్రకటించాయి.