Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్న సెలక్షన్ ప్యానెల్ గురువారం సమావేశమైంది. అంతకుముందు సెర్చ్ కమిటీ 212 మంది పేర్లను ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానల్‌కు పంపించింది. ఇందులో 6 మంది పేర్లను తుది జాబితా ఎంపిక చేసి గురువారం ప్యానల్ సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ (Gnanesh Kumar), సుఖ్‌బీర్ సంధు (Sukhbir Sandhu) పేర్లను ఫైనల్ చేశారు.
అనంతరం వీరిద్దరినీ కొత్త కమిషనర్లుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన అనూప్ చంద్ర పాండే కాల పరిమితి ఫిబ్రవరి 14న ముగియడం, మరో కమిషనర్ అరుణ్ గోయల్ ఈ నెల 8న రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీ చేయాల్సి వచ్చింది.
2023 డిసెంబరులో చేసిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ప్రకారం ఆ పదవులకు చేపట్టేవారు కేంద్ర ప్రభుత్వంలో సెక్రెటరీ స్థాయి హోదాలో పని చేసి ఉండాలనేది నియమాన్ని అర్హులుగా పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం సెక్రెటరీ హోదాల్లో పని చేస్తున్న, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల (సీఎస్) 212 పేర్లను సెర్చ్ కమిటీ పరిశీలించింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ వడపోత తర్వాత వీరిద్దరి పేర్లను ఎంపిక చేశారు. ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపికైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధు 1988 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు కావడం గమనార్హం. సుఖ్ బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారిగా, జ్ఞానేశ్ కుమార్ కేరళ క్యాడర్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. సుఖ్‌బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
అఖిల భారత సర్వీస్‌లోకి రాకముందు ఆయన అమృత్ సర్ లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ కుమార్ గతంలో కేంద్రం లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్య దర్శిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
జ్ఞానేశ్ కుమార్ ఐఐటీ(కా న్పూర్) పట్టభద్రుడిగా విద్యార్హతలు కలిగి ఉన్నారు. నూతన ఎలక్షన్ కమిషనర్లను ఎం పిక చేసేందుకు సీజేఐ, ప్రధాని, లోక్ సభలో విపక్షనేతలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఉండాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా కేంద్రం సీజేఐకి బదులుగా కేంద్ర మంత్రికి ప్యానెల్ స్థానం కల్పిస్తూ చట్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారణ చేపట్టనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధు నియామక విధానాన్ని ప్యానల్ సభ్యడు, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chaudhary) తీవ్రంగా తప్పుబట్టారు. 212 మంది పేర్లతో కూడిన జాబితాను బుధవారం రాత్రి తనకు ఇచ్చారని గురువారం మోదీతో సమావేశం సమయానికి వీరి ఎంపిక ఎలా సాధ్యమవుతుందని మీడియాకు తెలిపారు.
కాగా గురువారం మధ్యాహ్నం భేటీకి 10 నిమిషాల ముందు ఆరుగురి జాబితాను ఇచ్చారని తెలిపారు. ప్యానల్‌లో వారిదే మెజార్టీ ఉందని అందువల్ల జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధు పేర్లు ఖరారు చేయాల్సి వచ్చిందన్నారు. ఒకవేళ ప్యానల్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని తెలిపారు.