Loksabha Polls : ఈ ఒక్క ఫ్యామిలీలోనే 350 మంది ఓటర్లు.. దేశంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న సింగిల్ ఫ్యామిలీ ఇదే
కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే అవాక్కవుతారు. దేశంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న సింగిల్ ఫ్యామిలీ ఇదే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 350 మంది ఓటర్లు ఈ ఒక్క ఇంట్లోనే ఉన్నారు. అంటే.. ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసే సత్తా ఈ ఫ్యామిలీకి ఉంది. ఈ ఫ్యామిలీ ఏ పార్టీ వైపు ఉంటే.. ఆ పార్టీకి 350 ఓట్లు అధికంగా వచ్చే చాన్స్ ఉంది.
ఈ ఫ్యామిలీ అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలిపాలెం గ్రామంలో ఉంది. రాన్ బహదూర్ థాపా అనే వ్యక్తికి చెందిన ఫ్యామిలీ అది. ఆయన ఇప్పుడు బతికి లేడు కానీ.. ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించి పోయాడు. ఈ ఇంట్లో ఉన్న 350 మంది ఏప్రిల్ 19న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఓట్లేయబోతున్నారు. వీళ్ల గ్రామం రంగపార అసెంబ్లీ నియోజకవర్గం, సోనిత్ పూర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
రాన్ బహదూర్ థాపాకు 12 మంది కొడుకులు, 9 మంది కూతుళ్లు. బహదూర్ కు ఐదుగురు భార్యలు ఉండేవారు. ఆ కొడుకులకు, కూతుళ్లకు మళ్లీ కొడుకులు, కూతుళ్లు పుట్టడం, వాళ్లకు మళ్లీ కూతుళ్లు, కొడుకులు పుట్టడం.. ఇలా మొత్తం ఆ ఫ్యామిలీలో ప్రస్తుతం 1200 మంది ఉన్నారు. పిల్లలతో కలిపి 1200 మంది ఉండటంతో.. ఓటేసే హక్కు ఉన్నవాళ్లు మాత్రం 350 మంది ఉన్నారు.
మా నాన్న 1964 లో మా తాతతో కలిసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. మా నాన్నకు ఐదుగురు భార్యలు ఉండేవారు. మేము 12 మంది అన్నదమ్ములం, 9 మంది అక్కలు ఉన్నారు. ఆయనకు 56 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండేవారు. అలా.. మా ఫ్యామిలీ మొత్తం ఎక్స్‌టెండ్ అయింది. ఏప్రిల్ 19న నేపాలి పామ్ గ్రామంలో 350 మంది మా ఫ్యామిలీ నుంచే ఓట్లేయబోతున్నారు.. అని రాన్ బహదూర్ కొడుకు టెల్ బహదూర్ చెప్పుకొచ్చాడు. ఆయన ప్రస్తుతం నేపాలి పామ్ గ్రామానికి పెద్దగా ఉన్నాడు.

అయితే.. ఈ ఫ్యామిలీలో ఎక్కువ మంది జనాలు ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ కు అర్హత లభించలేదట. ఇప్పటి వరకు ఒక్క పథకంలోనూ లబ్ధిదారులుగా లేరని చెప్పుతున్నారు.
చాలామంది తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం రాలేదు. చాలామంది బెంగళూరుకు వెళ్లి అక్కడే ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకున్నారు. కొందరు రోజువారి కూలీలుగా ఉంటున్నారు.
రాన్ బహదూర్ థాపా 1997 లో మరణించాడు. ఆయన కొడుకులే ఆ తర్వాత ఆ ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటున్నారు. రాన్ కొడుకుల్లో ఓ కొడుకు సర్కీ బహదూర్ థాపా వయసు ప్రస్తుతం 64 ఏళ్లు. ఆయనకు ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలు ఉన్నారు.
