PM Modi Praises ED Officials : కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులను మెచ్చుకున్న ప్రధాని.. అవినీతిని అరికట్టడంలో ఈడీ పాత్రను కొనియాడిన మోదీ
కవిత అరెస్ట్ పై తెలంగాణ వ్యాప్తంగా పలు ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కేటీఆర్ అడ్డుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయనపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే... ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయన నేరుగా కవిత అరెస్ట్ పై స్పందించినప్పటికీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
అవినీతి నిర్మూలన కోసం, అవినీతిని అరికట్టడం కోసం ఈడీ అధికారులు తిరుగులేని నిర్ణయాలు తీసుకొంటున్నారని.. కఠినంగా ముందుకు వెళ్తున్నారని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారని మోదీ కొనియాడారు.
2014 కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంస్థలు అవినీతి నిర్మూలనలో తమ వంతు పాత్రను పోషించలేకపోయాయని అందుకే అప్పట్లో అవినీతి బయటికి రాలేదన్నారు. 2014 వరకు ఈడీ అధికారులు కేవలం 1800 కేసులు మాత్రమే రిజిస్టర్ చేయగలిగారని.. కానీ.. 2014 నుంచి 2024 మార్చి వరకు 4700 కేసులు రిజిస్టర్ చేశారని మోదీ అన్నారు.
2014 వరకు కేవలం 5 వేల కోట్ల అవినీతి సొమ్మును మాత్రమే అధికారులు సీజ్ చేశారని.. కానీ.. గత పదేళ్లలో అధికారులు లక్ష కోట్ల అవినీతి సొమ్మను పట్టుకున్నారని మోదీ స్పష్టం చేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఇతర నేరాల్లో నిందితులుగా ఉన్న చాలామంది ప్రముఖులను అరెస్ట్ చేసి 100 కోట్ల వరకు అవినీతి సొమ్మను జప్తు చేశారని మోదీ తెలిపారు.
ఇలాంటి సంస్థలే మన దేశానికి కావాలి. ఇది కొందరు వ్యక్తులకు సమస్యలను తీసుకొస్తుంది. అందుకే ఉదయం లేస్తే మోదీనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అయినా కూడా దేశమంతా ఒక్కటై అవినీతిని పారదోలే అధికారులకు మద్దతు పలుకుతోంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు పేపర్ల మీద రాతలు రాసి కలలు కంటుంటారు. కానీ.. మోదీ మాత్రం కలలను గ్యారెంటీలుగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు..
అంటూ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 లో పాల్గొన్న మోదీ పై వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. మీకు కూడా ఎన్నికల సమయంలోనే ఈడీ అధికారులు గుర్తుకొస్తారా? అప్పుడే ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తారా? అంటూ మోదీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.