Nalgonda : చేతివృత్తిదారుల సంక్షేమం కోసం 20వేల కోట్లు కేటాయించాలి
Nalgonda : నల్లగొండ ఫిబ్రవరి 12 (క్విక్ టుడే) : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం రూ. 20వేల కోట్లు కేటాయించి వారిని ఆదుకోవాలని కోరుతూ సోమవారం చేతివృత్తిదారుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ మాట్లాడుతూ చేనేత, కల్లుగీత, గొర్ల మేకల పెంపకం దారులు, రజక ,మత్స్య , కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, క్షౌర, శిల్ప ,దూదేకుల, టైలరింగ్, ఒగ్గు కథ, మంద హెచ్చులు గంగిరెద్దులు బ్యాండ్ వాయిద్య, సాంస్కృతిక కళాకారులు నేటికీ వృత్తులను నమ్ముకొని వాటి పైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు.
ఈ వృత్తులపై బహుళ జాతి కంపెనీలు కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఈ వృత్తులను దెబ్బతీయడం వల్ల వృత్తులు కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృత్తులలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారులకు రూ.20వేల కోట్లు కేటాయించి వృత్తిదారుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన రాష్ట్ర ఫెడరేషన్లు కార్పొరేషన్లకు పాలకవర్గాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ నిధులను ఖర్చు చేసి చేతి వృత్తిదారులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ లబ్ధిదారులు వేలాది మంది డీడీలు గట్టి సంవత్సరానికి పైగా గొర్రెల కోసం ఎదురుచూస్తున్న వారికి పెండింగ్ లో ఉన్న రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే డీడీలు చెల్లించిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల నాయకులు కొండ వెంకన్న, అవిశెట్టి శంకరయ్య, చెరుకు పెద్దలు, సాగర్ల మల్లేష్,సలివొజు సైదాచారి, మురారి మోహన్, గణేష్, శ్రీనివాసచారి,రవీందర్ తదితరులు పాల్గొన్నారు