బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థంగా మొగల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్ ను నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా కనిపిస్తుంది. ప్రేమ గురించి ఆలోచన వస్తే చాలామంది తాజ్ మహల్ గురించి మాట్లాడుకుంటారు. తాజ్ మహల్ కంటే ముందే ఒక ప్రేమ చిహ్నం తమిళనాడులో ఓ కట్టడం నిర్మితమైంది. చోళ రాజుల ఖ్యాతిని ఇనుమడింపజేసిన రాజేంద్ర చోళుడి ధైర్య సాహసాల గురించి తన ప్రియురాలు పరవై నంగె కోరిక మేరకు ఆయన ఒక ప్రేమ చిహ్నం కట్టించారు. అది తిరువారూర్ లో నిర్మించిన ఆలయం.
• రాజేంద్ర చోళుడు, పరవై నంగె ప్రేమ
రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు క్రీస్తు శకం1012 నుంచి 1044 వరకు పాలించారు. ఆయనను కడారం జయించిన వాడు అని అంటారు. అయితే తిరువారూర్ కు చెందిన నర్తకి తో రాజేంద్ర చోళినిని ప్రేమాయణం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. మొదటి రాజేంద్ర గంగై కడారం రాజ్యాలను జయించడంతోపాటు ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచాన్నే జయించిన ఆ రాజు మనసు గెలుచుకుంది ఆయన ప్రియురాలు. ఆమె తిరువారూర్ కు చెందిన నాట్య సుందరి పరవై నంగె. ఆమె నాట్యంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొనేవారు. చోళ చరిత్రలో రాజేంద్ర చోళుడికి ఎంత విశిష్టత ఉందో, ఆయన మనసులో పరువై నంగెకి ఎంత ప్రత్యేక స్థానం ఉందో, రాజేంద్ర చోళుని కుమారులు వారి విగ్రహాలకు పూజలు చేయడం ద్వారా గ్రహించవచ్చు.
• రాతి కోవెలగా మార్పు
రాజేంద్ర చోళుని కాలంలో ప్రియురాలు పరవై నంగె కోరిక మేరకు ఇటుకలతో నిర్మించిన ఆలయాన్ని రాతి కోవెలగా మార్చారని అదే తిరువూరు త్యాకేసర్ ఆలయం అని చరిత్ర చెబుతోంది. ప్రియురాలు కోరిక మేరకు రాజేంద్ర చోళుడు తన 16వ పాలన సంవత్సరం 1028 లో రాతి ఆలయం నిర్మాణం ప్రారంభించారు. 18వ పాలన సంవత్సరం 1030 లో పూర్తి చేశారు. రాతి ఆలయాన్ని ఆకర్షణీయంగా నిర్మించేందుకు రెండేళ్లు పట్టింది. ఇది ఆయన కాలంలో వేయించిన శాసనంలో ఉంది. పాత ఆలయాన్ని రాతిమందరంగా నిర్మించడమే కాకుండా ఆలయం వెలుపలి కలశం దగ్గర నుంచి ఆలయం అంతర్భాగం వరకు బంగారు పూత పూయించారు. గర్భగుడి యొక్క తలుపులు ఆలయ స్తంభాలకు రాగి ఫలకాలతో ఏర్పాటు చేయించారు. పూజా కార్యక్రమాల కోసం 28 దీపం కుందులు, 36 వజ్రాలు, ముత్యాలు పొదిగిన వేల బంగారు ఆభరణాలు కెంపులు, పచ్చలు, వెండి పాత్రలు కూడా బహుకరించారు. పరవై నంగె కోరికతో పూర్తయిన ఆలయానికి సంప్రోక్షణ జరిగింది. అప్పుడు రాజేంద్రుడి రథంలో ఆయన పక్కన ఆమె కూర్చుంది. వారిద్దరు స్వామిని దర్శించుకున్న ప్రదేశానికి గుర్తుగా ఆమె అక్కడ దీపం వెలిగించారు. ఈ శాసనంలో వడయార్ శ్రీ రాజేంద్ర చోళ దేవా ప్రియురాలు పరువైన నంగె అని రాసి ఉంది. తిరువారూర్ ఆలయంలో రాజేంద్ర చోళినితోపాటు పరవై నంగెకి నిత్యం పూజలు నిర్వహించేందుకు రాజాధిరాజ భూములు దానంగా ఇచ్చినట్లు శాసనం చెబుతోంది. ఈ శాసనంలో తలపై కిరీటం, మధ్యలో వస్త్రం, మెడలో ఆభరణాలు ధరించి రాజేంద్రుడు నిలబడి ఉండగా పక్కన అందమైన వస్త్రాలు ధరించి పరవై నమస్కరిస్తున్నట్లుగా కనబడుతోంది. ఇదంతా రాజేంద్ర చోళుడికి తన ప్రియురాలు పై ఉన్న అపారమైన ప్రేమను చాటుతుంది. ఆయన తర్వాత వచ్చిన ఆయన కొడుకులు కూడా వారి ప్రేమకు ముగ్ధులయ్యారు.
• గ్రామానికి ప్రియురాలు పేరు
రాజేంద్ర చోళుడు ఆలయానికి మాత్రమే కాకుండా గ్రామానికి కూడా తన ప్రియురాలు పేరును పెట్టారు. ప్రియురాలు పై తనకున్న అమితమైన ప్రేమను తెలియజేసేందుకు ఒక గ్రామానికి పరవైపురం అని పేరు పెట్టారు. ఇప్పుడు దానిని పనయ్యపురంగా పిలుస్తున్నారు. తన తండ్రి రాజేంద్ర చోళుడు పరవై నంగె మరణం తర్వాత వారి కుమారుడు రాజాధిరాజా వారికి తగిన గౌరవం ఇచ్చారు. ఆలయంలో వారికి విగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే రాజాధిరాజా తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన రెండో రాజేంద్రుడు కూడా తన తండ్రి రాజేంద్ర చోళుడు ఆయన ప్రియురాలు తల్లిగా భావించి
ఇద్దరు విగ్రహాలు చేయించి ఆలయంలో ప్రతిష్టించారు. వారి పుట్టినరోజు నాడు అక్కడ వేడుకలు దానధర్మాలు జరిగేవి. తర్వాత వచ్చిన వీర రాజేంద్ర చోళులు కూడా పరవైపేరుతో అనేక భూధానాలు చేశారు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా రాజేంద్ర చోరుడు పరవై పేరుతో అనేక దానాలు చేశారు. ఆ కాలంలో నిజమైన ప్రేమకు ఎంత విలువ ఇస్తారో చెప్పేందుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.