భూ భారతిపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి
భూమిపై ఎవరికి, ఎలాంటి హక్కుల వివరాలు, గ్రామాల వారీగా భూ యజమానులు, వారి భూమి వివరాలను తెలిపే రికార్డు అని అన్నారు. అంతే కాకుండా దీన్ని భూ యజమానుల రికార్డు కూడా అన వచ్చని తెలిపారు. నేటి నుంచి ప్రతి భూమి రిజిస్ర్టేషన్ ఈ రికార్డు ఆధారంగానే జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు చేసే మేలు ఏ కార్యక్రమం, పథకమైనా దీని ప్రకారమే అమలు చేస్తారన్నారు. ఈ రికార్డులో పేరు ఉన్న వారికే భూ యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వనున్నట్లు వివరించారు.
జిల్లాలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకురాబోతుందని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, కాబట్టి ప్రతి ఒక్క రైతు, పౌరుడికి ప్రణాళిక రూపంలో వివరించాలన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా భూ భారతిని జిల్లాలో చేపట్టడానికి ముందుగా 8 నియోజకర్గాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్, మండలం, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల అధికారుల సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.