మాడుగులపల్లి, ఏప్రిల్ 27 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండల కేంద్రంలోని ఆదివారం నాడు స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో మండల టీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఎస్.కె రసూల్, కార్యదర్శి దర్శనం రాంబాబు ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే మిర్యాలగూడ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ముఖ్యపాత్ర వ్యవహరిస్తున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో టిఆర్ఎస్ నాయకులు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని అనేక సార్లు వాగ్దానాలు చేసి, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా మోసం చేసి, భయం బ్రాంతులకు గురిచేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల హక్కులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, నిజాలను నిర్భయంగా రాయండి, తప్పు చేస్తే తప్పు అని రాయండి. అంతే కానీ ఎవరో చెప్పారు అని తప్పుడు వార్తలు రాసి మీకు మీ సంస్థకు చెడ్డ పేరు తేవద్దని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్, హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా, మండలాల జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలను నిర్వహిస్తూ, విజయాలను సాధిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘమని అన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్ తో కార్పొరేట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘమని అన్నారు. మా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్, హెల్త్ కార్డులు సౌకర్యం కల్పిస్తా అని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు టియుడబ్ల్యూజే జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే విజయాలను సాధించలేమని, అందరం కలిసికట్టుగా ఉంటేనే విజయాలను సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు నాగయ్య, శ్రీనివాస్, యాదగిరి, చంద్రశేఖర్, మాడుగులపల్లి తాజా మాజీ జడ్పీటీసీ సైదులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి కాంతరెడ్డి, కొండేటి మల్లయ్య, వివిధ మండలాల వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
