ఎన్నికల కోడ్ కూసేలోపు.. కొత్త రేషన్ కార్డులు వచ్చేనా?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం 20 లక్షల దరఖాస్తులు
చేస్తాం అపి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చి 70 రోజులు గడిచినా.. ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డుల జారీపై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. రోజుకో అప్‌డేట్ వినిపిస్తున్నా.. అన్ని పథకాలకు అవసరమయ్యే రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్పష్టంగానే ఉన్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన జారీ చేయడం లేదు. దీంతో ఇప్పటికే అభయహస్తం దరఖాస్తు చేసుకున్నలబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి.. ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశంపై చాలా మంది చర్చించుకుంటున్నారు. కాగా ప్రభుత్వం నుంచి మాత్రం కనీసం దరఖాస్తుల స్వీకరణ ప్రకటన
కూడా రాకపోవడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేలు మాత్రం తమ అధికారిక పర్యటనల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు.
100 రోజుల్లో తమ హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని హామీ ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ప్రస్తుతం సుదీర్ఘ ప్రక్రియ. దరఖాస్తులు స్వీకరించడం ఒక ఎత్తు అయితే.. అర్హులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. నిబంధనల రూపకల్పన నుంచి అర్హుల గుర్తింపు వరకు ఎన్నో పైరవీలు కొనసాగే అవకాశం ఉంది. ఇంటింటి సర్వే ద్వారా అనర్హుల తొలగింపు వంటి అంశాలు చాలా ముఖ్యమైన అంశం. గతంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల్లో ఇప్పుడు చాలా మంది అనర్హులుగా ఉన్నారు. పదేళ్ల కాలంలో ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడినారు. ఇప్పుడు అనర్హులను తొలగిస్తే ప్రభుత్వంపై భారం తక్కువగా పడే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం మరో 20 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే చాన్స్ ఉంది.
