District Collector Gautham : కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
District Collector Gautham : మహాశివరాత్రి సందర్బంగా మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని కీసర గుట్ట (కేసరగిరి) శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మల్కాజ్గిరి డి సి పి పద్మజతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు జాతర జరుగుతుందన్నారు. మార్చి 8న మహాశివరాత్రి పండగ ఉంటుందని తెలిపారు.
దైవ దర్శనానికి ఏర్పాటు చేసే 6 క్యూ లైన్ లలో మూడు క్యూ లైన్ లను సామాన్యు భక్తులకుఏర్పాటు చేసి వారికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని కలెక్టర్ ఆలయ అధికారులను ఆదేశించారు. శీఘ్ర దర్శనం, అభిషేకం టిక్కెట్లు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులకు తాగునీరు, నిత్యావసరాలు కావలసిన నీటి ని సరఫరా చేయాలనీ మిషన్ భగీరథ అధికారులకు కలెక్టర్ సూచించారు. 24 గంటలు పరిశుద్ధ కార్మికులతో దేవాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతమంతా పరిశుభ్రాంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తగిన రీతిలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలనీ ఆర్ అండ్ బి అధికారులకు తెలిపారు. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి అవసరమైన చోట మరుగుదొడ్ల మరమ్మతులు, లేని చోట తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుతు సరఫరా చేసి రహదారి వెంట విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.
కొలను దగ్గర గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. 24 గంటల పాటు అంబులెన్సులతో కూడిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎం అండ్తీ హెచ్ ఓ ను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల నుంచి బస్సులను ఏర్పాటు చేయాలనీ ఆర్టీసీ అధికారులను సూచించారు. వయోవృద్ధులు, దివ్యంగులకు ఇబ్బంది కలుగకుండా వై జంక్షన్ నుంచి దేవాలయం వరకు ఆటోలను, షెటిల్ బస్సులను ఉంచాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎక్కడికక్కడే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి, అన్ని శాఖల సమన్వయం తో సమీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీస్ శాఖ వారు పర్యవేక్షించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో అగ్ని మాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, ఆర్డీఓ రాజేష్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ తాటకం నాగలింగం, ఆలయ ఈ ఓ నరేంద్ర, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.