Vikas Raj: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి.., రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి శిక్షణ తరగతులు నిర్వహించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రాండమైజేషన్, భద్రతాపరమైన ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షిస్తూ, జిల్లా ఎన్నికల అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గత ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సెక్టోరల్ అధికారులచే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను సేకరించాలని, వాటి వివరాలను సకాలంలో పంపించాలన్నారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే నియమించినట్లైతే శనివారం మొదటి ర్యాండమైజేషన్ జరపాలని, ఈ.వీ.ఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా ఒకే రోజున, ఒకే సమయంలో అన్ని జిల్లాలలో చేపట్టాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలని, తమకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పించలేదని ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం కల్పించవద్దని హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు విజేందర్ రెడ్డి , డి ఆర్ ఓ హరిప్రియ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.