Mudireddy Sudhakar Reddy: కేటాయించిన బడ్జెట్ అంకెలను ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
Mudireddy Sudhakar Reddy : నల్లగొండ, ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : గత ప్రభుత్వం మాదిరిగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాలను విస్మరించినట్లుగా ఉన్నదని సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ఉన్న చిత్తశుద్ధి మిగిలిన సమస్యలపై లేదన్నారు. రుణమాఫీ రైతుబంధు రైతు భరోసా ఎప్పటి వరకు ఏ రకంగా అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో పేర్కొనలేదన్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు మ్యాచింగ్ గ్రాంట్ తో పాటు పావలా వడ్డీ రుణాలు ఎప్పటి వరకు ఇస్తారో కూడా చెప్పలేదన్నారు.
ముఖ్యంగా సాగునీటి రంగంలో పెండింగ్లో ఉన్న శ్రీశైలం సొరంగం మార్గాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి 3500 గృహ నిర్మాణాలు చేపడితే ఇండ్లు లేని నిరుపేదలవి ఎప్పటి వరకు పూర్తవుతాయని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి దళిత, గిరిజన, మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ ప్రవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయుటకు ఆరోగ్యశ్రీలో చేర్చాలి. గ్రామీణ పేదలను ఆదుకొనడానికి ప్రభుత్వం తగినన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అభివృద్ధి సాధ్యం అన్నారు.
మొత్తంగా బడ్జెట్ను పరిశీలిస్తే రాబడికి పోబడికి తేడా ఉందన్నారు. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం ఏరకంగా సమకూర్చుకుంటారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వం లాగా అంకెల్లో కేటాయింపులు చేసి ఖర్చులు పెట్టలేదన్నారు. అలా జరగకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త వహించాలని చెప్పారు. నిర్దిష్టంగా బడ్జెట్ను ప్రజాసంక్షేమానికి, ప్రజల అవసరాల తగ్గట్టుగా కేటాయించేందుకు ప్రజలు నిర్మాణాత్మక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.