Chandrababu : అధికారంలోకి రాగానే ఇంటికే తీసుకొచ్చి రూ.4 వేల పింఛన్ ఇస్తాం.. వై నాట్ పులివెందుల.. మా 3 పార్టీల అజెండా ఒక్కటే.. చంద్రబాబు పిలుపు
దీంతో తమకు తామే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఇష్టం ఉన్నట్టుగా పార్టీలు హామీలు ఇస్తున్నాయి. ఏపీలో ఈసారి ఎలాగైనా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీని కూడా ఏపీకి తీసుకొచ్చి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
తాజాగా చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ కూటమి అధికారంలోకి రాగాననే వెంటనే రూ.4 వేల పింఛన్ ను ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తమ పార్టీల అజెండా ఒక్కటే అని.. అభివృద్ధే ధ్యేయంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని అన్నారు.
Chandrababu : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో పొత్తు
టీడీపీ పార్టీ బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయంపై చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రం సాయం అవసరమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో జరిగింది మళ్లీ జరుగుతుందని వైసీపీ భ్రమ పడుతోందని.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 160 స్థానాలు, లోక్ సభ ఎన్నికల్లో 24 స్థానాలను తమ కూటమి చేజిక్కించుకుంటుందని చంద్రబాబు నొక్కి చెప్పారు. అందుకే.. ఎన్నికల పర్యటనకు ముందు తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని, దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చంద్రబు కోరారు. టీడీపీ కార్యకర్తలకు ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కుప్పంలో టీడీపీకి తిరుగులేదని.. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పంలో టీడీపీ విజయం సాధిస్తోందని అన్నారు.
కానీ.. ఇప్పుడు కుప్పంలో దోపిడి రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పం ప్రజలు ఇప్పటి వరకు తనపై ఏడు సార్లు అభిమానం చూపించారని.. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి మరోసారి డిపాజిట్లు కూడా దక్కకుండా తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు.
కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని.. కనీసం హంద్రీనీవా నీళ్లను కూడా కుప్పానికి తీసుకురాలేకపోయారని.. నీళ్లు నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. అధికారం ఉంది కదా అని కుప్పంలో రౌడీ రాజకీయాలు చేస్తున్నారు.
ఇష్టం ఉన్నట్టుగా వైసీపీ నేతలే గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గ్రానైట్లు తవ్వేస్తున్నారు.. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే రౌడీలను మొత్తం నియంత్రిస్తా అని చంద్రబాబు కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. కుప్పంలో ఈసారి టీడీపీకి లక్ష ఓట్ల మెజారిటీ రావాలి. అదే మీరు ఎన్నికల్లో నాకు ఇచ్చే కానుక అని చంద్రబాబు అన్నారు.
వై నాట్ 175 అని సీఎం జగన్ చెబుతున్నారు. 175 సీట్లు వాళ్లు గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వై నాట్ పులివెందుల అని నేను అంటున్నారు. నేను పిలుపునిస్తున్నాను. కుప్పంను వచ్చే ఐదేళ్లు అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటి మిట్టను అభివృద్ధి చేసిందే నేను.
ఆ తర్వాతే అక్కడ భూముల ధరలు పెరిగాయి. కానీ.. రికార్డులు మార్చారు. పేదల భూములను కొల్లగొడుతున్నారు. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు.