Chandrababu Proddatur Prajagalam : బిర్యానీ ప్యాకెట్లు అందాయా? క్వార్టర్ బాటిల్స్ అందాయా? అవి ఇస్తే జనాలు ఓట్లేస్తారా జగన్.. ప్రొద్దుటూరులో రెచ్చిపోయిన చంద్రబాబు
కూటమిగా పోటీలో దిగుతున్నప్పటికీ.. సీట్లు మాత్రం కొన్ని టీడీపీకి, కొన్ని జనసేనకు, కొన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో తమ పార్టీకి కేటాయించిన సీట్లలోని అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఇవాళ చంద్రబాబునాయుడు ప్రొద్దుటూరులో ప్రజాగళం పేరుతో సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మిట్ట మధ్యాహ్నం.. మిమ్మల్ని చూసి ఎండ భయపడుతోంది తప్ప మీరు ఎండకు భయపడటం లేదు.. అది ప్రొద్దుటూరు సంకల్పం అంటూ సభకు వచ్చిన టీడీపీ శ్రేణులకు, ప్రజలకు ఉత్సాహాన్నిచ్చారు.
కడపలో పసుపు సైన్యానికి అన్ని వర్గాల మద్ధతు లభించింది. ఇది ఇక ఎవరి ఇలాఖా కాదు. పెత్తందారులకు కాదు. టీడీపీ అంటే అన్ స్టాపబుల్. కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తోంది. ఎవ్వరూ ఆపలేరు. మొన్ననే ఇక్కడే సీఎం సభ పెట్టారు..
గుర్తుందా? ఏడు నియోజకవర్గాలకు చెందిన మనుషులను పోగేసుకొచ్చారు.. అవునా కాదా? బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చాడు. క్వార్టర్ బాటిల్లు ఇచ్చాడు. సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు. నీ మీటింగ్ కు, నా మీటింగ్ కు ఇదే వ్యత్యాసం జగన్ మోహన్ రెడ్డి.. అని చంద్రబాబు అన్నారు.
Chandrababu Proddatur Prajagalam : మీది జిల్లా మీటింగ్.. నాది ప్రొద్దుటూరు మీటింగ్
మీది జిల్లా మీటింగ్.. నాది ప్రొద్దుటూరు మీటింగ్. మాది ఎండల్లో మీటింగ్.. మీది సాయంత్రం వెన్నెల్లో మీటింగ్. ఇది ప్రజల కమిట్ మెంట్. అది నీ మీద ఉండే వ్యతిరేకత. పాపం పోలీసులు చాలా అవస్థలు పడ్డారు. ప్రజలు పారిపోతా ఉంటే.. గేట్లు మూసేసి చుట్టుపక్కన ఉండి బాబ్బాబు కూర్చో అని అడుక్కున్నారు.
రాయలసీమ గడ్డ.. రాయలసీమకు గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. ఐదేళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. జగన్ ఇప్పుడు ఇంటికి పోతున్నాడు కాబట్టి పొయ్యే ముఖ్యమంత్రి. కానీ.. ఐదేళ్లు తగలబడ్డాడు మన నెత్తిన. నువ్వు ఈ ఐదేళ్లలో ఏమైనా చేశావా రాయలసీమకు అని ప్రశ్నిస్తున్నా.
పోనీ కడపకు ఏమైనా చేశావా? ప్రొద్దుటూరుకు ఏమైనా చేశావా? పులివెందులకు ఏమైనా చేశావా? రెండు సార్లు వెళ్లావు. నువ్వు ఏం చేశావు. స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశావు. అదే నేను ఉంటే స్టీల్ ఫ్యాక్టరీకి ఇనాగరేషన్ చేసేవాడిని. అది నా బ్రాండ్. ఇది జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్.
రాయలసీమలో సాగునీటి గురించి ఒక్క మాట మాట్లాడడా? ఈ విషయం గురించి నేను మాట్లాడుతాను. రాయలసీమకు సాగునీరు ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు. సొంత నియోజకవర్గంలో ఏం చేశావో.. చెప్పే ధైర్యం నీకు ఉందా? అంటూ జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు.
జగన్ ఇలాకా ప్రొద్దుటూరులో చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా మలిచి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
వరుసగా నాలుగో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభల్లో పాల్గొంటున్నారు. ప్రొద్దుటూరు సభ కంటే ముందే నెల్లూరు, తిరుపతి కడపలో పర్యటించారు. ఆ తర్వాత సూళ్లూరుపేట ప్రజాగళం సభలో పాల్గొన్నారు.