ఈనెల 28న తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన బహిరంగసభ
టీడీపీ - జనసేన కూటమి వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. మంత్రి ధర్మాన చేసిన కీలక వ్యాఖ్యలు వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తామనడాన్ని టీడీపీ - జనసేన కూటమి సీరియస్‌గా తీసుకుంది. ఈసీ ఆదేశాలకు విభిన్నంగా వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా ఎలా నియమిస్తారని కూటమి సభ్యులు ప్రశ్నించారు. మంత్రి ధర్మాన వ్యాఖ్యల పట్ల ఈసీకి ఫిర్యాదు చేస్తామని సమన్వయ కమిటీ స్పష్టం చేసింది. కాగా ఈ కమిటీ భేటీలో ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సర్దుబాటు అంశం మాత్రం రాలేదు. పార్టీ అధినాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే సీట్ల అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీతో కలిసి పోటీచేయాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పొత్తుల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే సీట్ల అంశాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం బహిరంగ సభ లోపే ఈ చర్చలు పూర్తవుతాయని, సభలోనే ప్రకటన ఉండవచ్చని అంచనాలు కొనసాగుతున్నాయి.
మరోసారి అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం అరాచకాలకైనా తెగించే అవకాశాలు లేకపోలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇందుకోసం రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు మీడియాపై దాడులు చేస్తున్నారని, ఈ దాడులను ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేసినట్లు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీశారని, ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా బహిర్గతం చేయలేకపోతున్నారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తమై జగన్‌కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించినట్లు తెలిపారు. ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారని, ఇందుకోసమే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.