YS Viveka Wife Open Letter : ఎన్నికల వేళ జగన్‌కు షాక్ ఇచ్చిన వివేకా భార్య.. ఇదేనా నీ కర్తవ్యం అంటూ నిలదీసిన సౌభాగ్యమ్మ
ఈనేపథ్యంలో ఆయన భార్య సౌభాగ్యమ్మ.. సీఎం జగన్ కు లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ లేఖలో ఉన్న సారాంశం ఇదే.. 2009 లో నువ్వు నీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అని చెప్పుకొచ్చారు
సౌభాగ్యమ్మ. అంతే కాదు.. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని చాలా బాధపెట్టాయి. మన కుటుంబంలోని వారు హత్యకు గురికావడం.. ఆ హత్యకు కారణం అయిన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం నాకు బాదేసింది.. అంటూ సౌభాగ్యమ్మ జగన్ ను డైరెక్ట్ గా నిలదీశారు.
YS Viveka Wife Open Letter : షర్మిలను కూడా టార్గెట్ చేస్తున్నా నువ్వు పట్టించుకోవా?
నువ్వు సీఎం కావాలని పరితపించిన వ్యక్తుల్లో నీ చిన్నాన్న కూడా ఒకరు. కానీ.. ఆయనపై నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో మాట్లాడటం సమంజసమేనా? ఇది నీకు తగునా? ఆయన్ను చెప్పలేనంత విధంగా హననం చేయించడం కరెక్టేనా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తుంటే.. నిందలు మోపుతుంటే, దాడులకు తెగబడుతుంటే.. నువ్వు పట్టించుకోవా? కొందరు ఇంత నీచానికి దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదు అన్నారు.
సునీతకు మద్దతుగా షర్మిల నిలిచింది. ఆమెకు మద్దతుగా షర్మిల పోరాటం చేస్తోంది. అందుకని టార్గెట్ చేస్తున్నారు. నీ సొంత చెల్లెలును టార్గెట్ చేస్తున్నా నువ్వు పట్టించుకోవా? నువ్వు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నావు.. అంటూ సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.
నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి. కనీసం కుటుంబ సభ్యుడిగా పట్టించుకోకపోయినా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా పట్టించుకోవాలి కదా. ఇదేనా నీ కర్తవ్యం.. నీ చిన్నాన్న హత్యకు కారణమైన వాళ్లకే నువ్వు మళ్లీ ఎంపీ సీటు ఇచ్చావు. మళ్లీ ఎంపీగా అవకాశం కల్పించావు.. ఇది నీకు సమంజసమా? అంటూ ఆమె జగన్ ను సూటిగా ప్రశ్నించారు.
నీ చిన్నాన్న హత్యకు కారకులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. చివరి ప్రయత్నంగా.. న్యాయంగా, ధర్మంగా ఆలోచన చేయాలని నిన్ను ప్రార్థిస్తున్నా. రాగ ద్వేషాలను పక్కన పెట్టి పాలన చేస్తామని.. ప్రమాణం చేశావు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని నేను నిన్ను వేడుకుంటున్నా.. అంటూ సౌభాగ్యమ్మ లేఖలో స్పష్టం చేశారు.
వివేకా హత్యలో ప్రధాన నిందితులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అని సునీత కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్న తరుణంలో మళ్లీ అవినాష్ రెడ్డికే కడప ఎంపీ టికెట్ ను వైసీపీ ఇవ్వడంతో పాటు.. అవినాష్ ను జగన్ వెనకేసుకు రావడంపై సునీత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అవినాష్ కు టికెట్ ఇవ్వకూడదని.. చాలా ప్రయత్నాలు చేశారు
కానీ.. జగన్ మాత్రం కడప ఎంపీ టికెట్ మళ్లీ అవినాష్ కే కేటాయించారు. ఈనేపథ్యంలోనే సునీత తల్లి సౌభాగ్యమ్మ.. జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో హత్యకు కారకులైన వారికి నువ్వు రక్షణ కల్పించడం తమను మరింత బాధిస్తోందని సౌభాగ్యమ్మ వాపోయారు. ప్రస్తుతం ఈ లేఖ ఏపీలో చర్చనీయాంశమైంది. చూడాలి మరి.. ఈ లేఖపై జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో?