Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతాన ప్రసాదం.. భారీగా క్యూ కట్టిన భక్తజనం
సంతానం లేని వారికి గరుడ ప్రసాదం వితరణపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నేపథ్యంలో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 30 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో అటు వాహనదారులు, ఇటు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
మాసబ్ ట్యాంక్ నుంచి చిలుకూరు ఆలయం వరకూ ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే భక్తులు ఎంత మొత్తంలో తరలివచ్చారో అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలిలోని ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో పూర్తిగా నిండిపోయింది. దాదాపు లక్షకు పైగా వాహనాల్లో భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.
చిలుకూరు బాలాజీ ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
తొలి రోజు ఇక్కడ వేద పండితులు పుట్టమన్నుతో హోమ గుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. శుక్రవారం ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. తర్వాత గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంచనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల మీడియాలో ప్రకటించారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శుక్రవారం ఒక్కసారిగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా పోటెత్తారు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ఎవరూ ఊహించని రీతిలో కార్లు, ఇతర వాహనాల్లో భక్తులు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తింది.
భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో భక్తులు తమ ద్విచక్రవాహనాలు, కార్లు పార్కు చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10:30 గంటల వరకూ భక్తులు భారీగా రావడంతో ఆలయం వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడ్డారు.
ఆలయం వద్ద గరుడ ప్రసాదం పంచేందుకు ఉదయం కొంత సమయం ఇవ్వగా అనంతరం ఆపేశారు. దేవస్థానం నిర్వాహకుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఎండాకాలంలో ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తే గరుడ ప్రసాదం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
5 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తే.. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది తరలి వచ్చారని మొయినాబాద్ సీఐ తెలిపారు. అందుకే ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. అయితే శని, ఆదివారాలు కూడా గరుడ ప్రసాదం పంపిణీ ఉంటుందని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు.