రైతులకు అండగా జిల్లా యంత్రాంగం
*జిల్లా స్థాయి అధికారులు, మండల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లతో నిరంతరం సమీక్షలు జరిపి సజావుగా కొనుగోలు జరిగేలా కలెక్టర్ ఆదేశాలు జారీ*
*రైతులు ఎటువంటి ప్రలోభాలకు గురికావొద్దు*
*అనవసర వదంతులు నమ్మవద్దు*
*తొర్రూర్ మే 18(క్విక్ టుడే న్యూస్):- జిల్లా యంత్రాంగమంతా రైతులకు అండగా ఉందని జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ. ప్రేమ్ కుమార్, డీఎం సీఎస్ కృష్ణవేణి పేర్కొన్నారు.
ఆదివారం, జిల్లాలోని తొర్రూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, లతో కలిసి (ప్రెస్ మీట్) నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ. ప్రేమ్ కుమార్, డీఎం సీఎస్ కృష్ణవేణి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
యాసంగి 2024-25 కాలానికి సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, గత రబీ సీజన్ తో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ మూడింతల దిగుబడి పెరిగిందని, ఇప్పటివరకు జిల్లాలో 75 శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిత్యం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ధాన్యం సేకరణ, తరలింపును సమర్థవంతంగా నిర్వహించడానికి 18 మండలాల తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని, కానీ రైతులు కొంత మంది స్వార్థపరుల, వ్యక్తిగత రాజకీయాల వదంతులను నమ్మి ధర్నాలకు ఉపక్రమిస్తున్నారన్నారని, దీని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు.
తొర్రూరు మండలం ఔతాపురం, తొర్రూరు, అమ్మాపురంలలో రైతులు ధర్నా చేపట్టారని, ఈ సెంటర్లో ప్రతి రోజు లారీలు పెట్టినప్పటికీ రైతులు అదనపు లారీలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా లారీలను కూడా ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు, లారీలు, గోనె సంచుల సమాచారం పట్ల రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు జరగడం వల్ల రైతులకు వేగవంతంగా నగదు చెల్లింపులు చేస్తున్నామని, కేంద్రానికి వచ్చే ప్రతి గింజ కొనడం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని కలెక్టర్ నిరంతరం సమీక్షలతో ఆదేశిస్తున్నారన్నారు.
కాగా, ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 25889 మంది రైతుల నుంచి సన్న ధాన్యం లక్షా 7 వేలు మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 26475 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 173 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు.
ఇదే సీజన్ లో గత ఏడు 2023-24 సంవత్సరంలో 33850 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 2024-25 సంవత్సరంలో ఇప్పటివరకు చూసుకుంటే గణనీయంగా లక్షా 27 వేల 224 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇంకా తేమ శాతం రాని ధాన్యం కేంద్రాల్లో ఉందని, వాటికి సంబంధించిన కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తయితే కొనుగోలులో మరింత వృద్ధి నమోదు అవుతుందని వెల్లడించారు.
అధికార యంత్రాంగం ఈ దిశగా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నామని, ధాన్యం కూడా ఎక్కడ తడవకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. జిల్లాలో ఇంకా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, దానికి అనుగుణంగా 56 వేల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం ఉందని, గోనె సంచులు కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా అందుబాటులో ఉన్నాయని, కావున రైతులు ఎలాంటి చెందాల్సిన అవసరం లేదని, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, అక్రమాల గురించి మా దృష్టికి వచ్చిందని, అలాంటి కొనుగోలు కేంద్రాలను గుర్తించడం జరిగిందని, వాటి మీద దర్యాప్తు చేసి బాధ్యులపై ఖచ్చితంగా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.