HYDRA Commissioner : నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేయం
పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారని ఇటీవల వస్తున్న ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఇకనుంచి నివాసేతర, కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనాలపై మాత్రమే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో నిర్మించిన ఇండ్లల్లో ప్రజలు నివాసముంటున్నవాటిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మున్ముందు ఎలాంటి ఆక్రమణలు జరుగకుండా చూడడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఇప్పటికే అనుమతుల్లేకుండా మాదాపూర్ లోని సున్నం చెరువు, మల్లంపేట కత్వ చెరువు, అమీన్‌పూర్ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారని, ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నామని రంగనాథ్ తెలిపారు. సున్నం చెరువులో గతంలో చేపట్టిన ఆక్రమణలు తొలగించినప్పటికీ మళ్లీ అవి పుట్టుకొచ్చాయని, దాదాపు 10 ఎకరాల పరిధిలో ఉన్న ఆక్రమణల్నిపూర్తిగా తొలగించామని తెలిపారు.
మల్లంపేట చెరువు ఆక్రమణలో ఇప్పటివరకు కుటుంబాలు నివాసం లేని 13 విల్లాలను కూల్చివేశామని, 2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 5 విల్లాల విషయంలో అనుమతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అమీన్‌పూర్ చెరువులో 51 ఎకరాల విస్తీర్ణంలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు తొలగించామన్నారు, పద్మావతినగర్‌లో అక్రమ లే అవుట్ ప్రహరీ, రెండు సెక్యూరిటీ గదులను కూల్చివేశామని తెలిపారు.
ఈ ఆక్రమణల వెనుక స్థానిక నేతల అండదండలు ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సున్నం చెరువు వద్ద ఆక్రమణల వెనుక గోపాల్ అనే వ్యక్తి షెడ్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. అంతేకాకుండా కొందరి నుంచి అద్దెలు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఆయన ఆశ్రయం ఇస్తూ ప్రారంభంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి వాటిని అద్దెకు ఇస్తున్నారని తెలిపారు.
ఆ తర్వాత వాటిని అనుమతుల్లేకుండా శాశ్వ త భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. అన్ని చెరువుల వద్ద ఇదే రకమైన విధానం జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.