peerzadiguda: పీర్జాదిగూడలో పేదల ఇండ్లు నేలమట్టం
-తాసీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన
peerzadiguda: పీర్జాదిగూడ, క్విక్ టుడే : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయిప్రియ నగర్ సాలార్‌జంగ్ కంచెలో వేసిన పేదల ఇండ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. మంగళవారం ఉదయం పోలీసు బందోబస్తుతో వచ్చిన అధికారులు సర్వే నెంబర్ 10, 11లోని సీలింగ్ భూమిలో నిర్మించిన కట్టడాలను జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ వెంచర్‌లో దాదాపు 350 ఇండ్లు ఉండగా కోర్టు కేసుల్లో ఉన్న నిర్మాణాలు మినహా మిగతా 250 ఇండ్లను పూర్తిగా కూల్చివేశారు. బాధితులు అడ్డకునేందుకు యత్నించగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో బాధితులు కోపోద్రిక్తులై రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టారు. అడిగిన లంచాలు ఇవ్వనందువల్లే తమ ఇండ్లను కూల్చివేస్తారా అంటూ దుయ్యబట్టారు.
మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల ధర్నా..
అధికారులు ఇళ్ల నిర్మాణాలను కూల్చివేతను వ్యతిరేకిస్తూ బాధితులు మేడిపల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 1, 6 లో ప్రభుత్వ భూములు ఉంటే వాటిని కూల్చకుండా తమ ఇండ్లను కూల్చడమేంటని ప్రశ్నించారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అన్యాయంగా తమ ఇండ్లను కూల్చారంటూ ఆరోపించారు. 25 ఏళ్ల క్రితం 1995లో ఈ వెంచర్‌ను చేశారని గుర్తు చేశారు. అప్పుడు చేసిన లేఅవుట్ లో తాము ప్లాట్లను కొనుక్కున్నామని, ఇన్నేండ్ల నుంచి లేని హడావుడి ఇప్పుడేంటని నిలదీశారు. పైసా పైసా కూడబెట్టుకుని ఈ భూములను తెలియక కొన్నామని వాపోయారు. ఎల్ఆర్ఎస్, ఇంటి నెంబర్లు, కరెంట్ బిల్లులు తమ వద్ద ఉన్నాయని, ప్రభుత్వానికి మేము పన్నులు కూడా కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు ప్రభుత్వానివి అయితే రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం జారీ చేసిన 118 జీవో ప్రకారం రెగ్యులరైజ్ కోసం రూ.250 రుసుము దరఖాస్తు కూడా చేసుకున్నామని తెలిపారు. కొంతమంది ఇండ్లు కట్టుకున్నవారిలో ఇంటినెంబర్లు సైతం పొందారని తెలిపారు. ప్రభుత్వ భూములు అయితే మున్సిపల్ శాఖ అధికారులు ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పేదలకు న్యాయం చేస్తామంటూనే మరో వైపు పేదల ఇండ్లు కూల్చివేయడమేంటని నిలదీశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తహసీల్దార్ హసీనా తీరును వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఓ కాంగ్రెస్ నాయకుడి నిర్వాకం వల్లే తమ ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. తమ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారని, దానిని కాదన్నందుకే తమపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నట్టు ఆరోపించారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని, లేదంటే ఊరుకునేది లేదని బాధితులు హెచ్చరించారు.