KCR : నా కట్టే కాలే దాకా.. తెలంగాణ కోసం కొట్లాడుతా
నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
-కృష్ణ నది నీరు మన అందరి హక్కు
-కృష్ణా నీరు మన జీవనమరణ సమస్య
-10 సంవత్సరాలు మీ దీవెనలతో పని చేశా
-నల్గొండ సభ కేంద్ర ట్రిబ్యునళ్లకు ఒక హెచ్చరిక
-అధికారం శాశ్వతం కాదు తెలంగాణ హక్కులు
శాశ్వతం
-రైతుబంధు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది
-కాంగ్రెస్ వాళ్లకు కావాల్సిన పైసలు, పైరవీలు, పదవులు మాత్రమే
-మళ్లీ డబల్ స్పీడ్ తో మనమే అధికారంలోకి వస్తాం
KCR : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 13 (క్విక్ టుడే) : నా కట్టే కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడుతా అని, కృష్ణా నది నీరు మనందరి హక్కు అని, కృష్ణానది నీరు మనందరి జీవన మరణ సమస్య అని బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో నల్లగొండ సభను మంగళవారం నల్లగొండలోని బైపాస్ రోడ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 24 సంవత్సరాల నుండి పక్షిల తిరుగుతూ తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేశానని అన్నారు. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలోని మునుగోడు దేవరకొండ నియోజకవర్గలలో ఫ్లోరైడ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించాలని ఆనాడు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లిన కూడా సమస్య పరిష్కారం కాలేదు అన్నారు. నేను నల్లగొండలో పెట్టిన సభ రాజకీయ సభ కాదని ఉద్యమ సభ అన్నారు. తెలంగాణ ప్రజలందరి బతుకులను మార్చే సభ ఇది అని అన్నారు. కృష్ణా జలాలు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య అని అన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసి 24 గంటలు కరెంటు ఇచ్చానని అన్నారు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడిన భువనగిరి సమీపంలోని బస్వాపురం దేవరకొండ సమీపంలోని డిండి ప్రాజెక్టులు పూర్తి కావడానికి వచ్చాయని అని అన్నారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ వచ్చిన తర్వాత బిజెపి పార్టీతో ఇక్కడ ప్రజల కోసం పోరాటాలు చేశానన్నారు. తెలంగాణ సమస్యల మీద కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినా స్పందించలేదన్నారు. కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదని అన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఉంటేనే బాగుండేదని అంటున్నాడని అన్నారు. ఎంతమంది త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ గూర్చి ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడడం సరికాదు అన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి బలిదానం చేసుకున్న సంగతి మీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. నల్గొండ సభ కేంద్రంలోని ట్రిబ్యునళ్లకు ఒక హెచ్చరిక లాంటిదని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు కావాలని ప్రజాసమస్యలు కాదని అన్నారు. పోరాటాలకు మనం సిద్ధంగా ఉండాలని అప్పుడే మన హక్కులు కాపాడుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక మంచి పని చేయలేదని ఒక మంచి మాట మాట్లాడలేదని కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
అధికారం శాశ్వతం కాదని తెలంగాణ హక్కులు మాత్రం శాశ్వతం అన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్న సభను చూసి బడ్జెట్ సమావేశాలను పక్కకు పెట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ పై తీర్మానం చేశారన్నారు. నల్లగొండ జిల్లా దామర చర్ల లో 4వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రారంభించామని ప్రస్తుతం అది 80 శాతం పూర్తి అయ్యిందని అన్నారు. రామగుండంలో ఎన్టిపిసిని నిర్మించుకున్నామని అన్నారు. రైతులకు రైతుబంధు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లకు కావాల్సినవి పైసలు పైరవీలు పదవులు మాత్రమే అని అన్నారు. మేడిగడ్డ కు తమ పార్టీ ఆధ్వర్యంలో కూడా అందరిని తీసుకెళ్తామని, మేము కూడా చరిత్ర చెబుతామని అన్నారు. మేడిగడ్డ వద్ద ఒకటి రెండు పిల్లర్లు కుంగ గానే మొత్తం ప్రాజెక్టులన్ని కుంగినట్లు కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పట్టిన కడెం ప్రాజెక్టు మూసి ప్రాజెక్టుల గేట్లు కూడా కొట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు నదులపై వాటి నీటిపై అవగాహన లేదని అడిగితే తాను చెప్పే వాడినని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి మీటర్లు పెడతానంటేనే తాను దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారన్నారు.
మళ్లీ డబల్ స్పీడ్ తో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. వరి పంట మంచిగా పండితే 500 రూపాయలు బోనస్ తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఇది సరికాదని అన్నారు. కృష్ణ గోదావరి జలాలలో సంపూర్ణ వాటా తెలంగాణకు వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే నది జలాల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో పక్ష నేత నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కౌశిక్ రెడ్డి, పద్మారావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి భాస్కరరావు పాల్గొన్నారు.