Kothagudem Skill Development Centre : అభివృద్ధికి ఆమడ దూరంలో కొత్తగూడెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్?
- తలుపులు కిటికీలకు చెదలు
- విలువైన ఏసీలు నిరుపయోగం
- అలంకారప్రాయంగా మంచినీటి వసతి
- పరిసర ప్రాంతాలు అపరిశుభ్రం
- బిల్లింగ్ ఆవరణలో మద్యం సీసాలు దర్శనం
- వేలాడుతున్న విద్యుత్ స్విచ్ బోర్డులు
- అభివృద్ధికి దూరంగా సెంటర్ ఉందనే
ఆరోపణ
Kothagudem Skill Development Centre : భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో మే 19(క్విక్ టుడే) : నిరుద్యోగులకు వివిధ రంగాలలో శిక్షణతో పాటుగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కొత్తగూడెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(పట్టణ జీవనోపాదుల కల్పనా కేంద్రం)కు గ్రహణం పట్టినట్లుగా కనిపిస్తుందని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన ఈ సెంటర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్న ఆరోపణలు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేదనే వాదన సైతం ప్రజల నుండి వినబడుతుంది. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని ప్రగతి మైదానం ఆవరణలో డిఎంఎఫ్ నిధుల కింద 50 లక్షల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణ పనులకు 15-8-2018 సంవత్సరంలో అప్పటి ఎక్సైజ్ క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి పద్మారావు గౌడ్ శంకుస్థాపన చేయడం జరిగింది.
నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్తగూడెంకు ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకటరావు ప్రారంభోత్సవం చేశారు. ఒక బిల్డింగ్ లో కంప్యూటర్ శిక్షణ విభాగం నడుస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ బిల్డింగుకు సంబంధించిన క్లాస్ రూములు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా క్లాస్ రూముల గదులకు ఉండే తలుపులు కిటికీలకు చెదలు పట్టి కనబడుతున్నాయి.
ఇదిలా ఉండగా విద్యుత్ స్విచ్ బోర్డులు సైతం వేలాడుతూ ఉండడం నిర్లక్ష్యానికి నిదర్శనం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా అధ్వానంగా ఉండడాన్ని చూస్తే కలవరపెడుతుంది.
మరో భవనం తలుపులు తెరుచుకొని వైనం..
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాట్లు భాగంగా ఎలక్ట్రికల్ ఫిట్టర్ రాడ్ బెండింగ్ ఇతర రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసినప్పటికీ నేటికీ ఆ భవనం తలుపులు తెరుచుకోలేదనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.
ఈ బిల్డింగ్ లో నాలుగు ఎయిర్ కండిషన్ లతో పాటు మంచినీటి వసతిని ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగా మారి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని విమర్శలు రావడం గమనార్హం.
మందుబాబులకు అడ్డా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..
కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందు బాబులకు అడ్డగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు దర్శనం ఇవ్వడం చూస్తే నిజంగా ఈ ఉపాధి కేంద్రం మందు బాబుల కోసమే కట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించడం విశేషం.
లక్షల రూపాయలు పోసి కట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడాల్సింది పోయి హస్తవ్యస్తంగా ఉండడం పట్ల విమర్శలకు తావిస్తుంది. నిరుద్యోగ సమస్యను తీర్చడంతో పాటుగా ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను అభివృద్ధి దిశలో నడిపించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని నిరుద్యోగ యువత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
కళతప్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..
నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉపాధి కల్పించేందుకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకటరావు హాయంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే నేడు ఆ సెంటర్ కళతప్పి బోసిపోయినట్లుగా కనిపిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుద్యోగ యువతతో కళకళలాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోట శివ శంకర్ డిమాండ్ చేశారు.