MLC Kavita arrested : ఎమ్మెల్సీ కవిత మరో సారి అరెస్ట్..!
అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషియల్ కష్టడీ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ రోజు సీబీఐ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటివరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా ఇక ఆమెను సీబీఐ కస్టడీలో ఉండనుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...
లిక్కర్ స్కామ్ కేసులో ఇదివరకే అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న కవితను నేడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైల్లోనే విచారణ జరిపారు. గతంలోనూ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోనూ ఆమెను విచారించారు.
కాగా ఈరోజు ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రలు చేసినట్లుగా సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్టు చేస్తున్నట్లుగా ఈరోజు (గురువారం) ప్రకటన ద్వారా అధికారులు తెలియజేశారు.
దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషల్ కస్టడీ లో ఉన్న కవితను సీబీఐ అధికారులు హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. నేడు కోర్టుకు సెలవు ఉన్నందును రేపు (శుక్రవారం) కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ చేపట్టాలని గతంలోనే సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కవిత బెయిల్ విషయంపై ఈ నెల 16వ తేదీన పిటిషన్ విచారణకు రాబోతున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో కవితను మళ్ళీ సీబీఐ అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారులు అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తక్షణమే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆయన కోర్టును కోరారు.