MLC kavitha : కవిత బెయిల్ పై కాసేపట్లో విచారణ....సర్వత్ర ఉత్కంఠ...
ఇక ఈ పిటిషన్ లో తన చిన్న కొడుకుకి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నందున ఈ సమయంలో తన అవసరం తన కుమారుడికి ఉందని అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సాధారణ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు.
అయితే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఉండడం వలన కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అందుకే బెయిల్ ఇవ్వద్దంటూ ఈడి అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇరుపక్ష వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ ఏప్రిల్ 1కి కేసును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు పై విచారణలు జరగనున్నాయి.
ఇది ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవితను ఈడి అధికారులు హైదరాబాదులోని తన నివాసంలో అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను ఢిల్లీకి తీసుకువచ్చి మార్చి 16న ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే 10 రోజులు కస్టడీకి ఈడి అధికారులు కోరగా న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
అనంతరం మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు కోరగా న్యాయస్థానం 3 రోజులకు అనుమతించింది . ఇక చివరిగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు అవెన్యూ కోర్టులో హాజరుపరచారు. దీంతో ఏప్రిల్ 9వ తేదీ నుండి 14 రోజులు పాటు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇక ఈ జ్యూడిషియల్ రిమాండ్ లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన వసతులు కవితకు కల్పించాల్సిందిగా న్యాయస్థానంకు విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం , బట్టలు ,అభరణాలు ధరించడం సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం , దుప్పట్లు మరియు చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లను ఇవ్వాల్సిందిగా కవిత తరపున లాయర్లు కోరగా దానికి కోర్టు అనుమతించింది.
కానీ కవిత జైల్లోకి వెళ్లిన తర్వాత జైలు అధికారులు మాత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుమతించలేదని కవిత తరపున న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తెలియజేశారు. ఇక ఈరోజు విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి .
ఇక ఈరోజు జరిగే విచారణలో మభ్యంతర బెయిల్ మంజూరు కానట్లయితే జైల్లో వసతులైన కల్పించే విధంగా జైలు అధికారులకు ఆదేశించాలని కోర్టును కవిత తరపున న్యాయవాదులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.