Southwest Monsoon : ముందుగానే నైరుతి రుతుపవనాలు.. తొలుత ఎక్కడ ప్రవేశిస్తాయంటే..
అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే చేరుకుంటున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు తీపి కబురును తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం దక్కే చాన్స్ ఉందని వారు చెబుతున్నారు.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ముందే.. అంటే మే 19న దక్షిణ అండ మాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని ఐఎండీ సోమవారం వెల్లడించింది.
ఆ తర్వాత జూన్ 1వ తేదీలోగా కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమమే అని వారు పేర్కొంటున్నారు. కాగా రుతుపవనాలు కేరళకు సకాలంలో చేరుకోవాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉంటేనే సాధ్యమవుతుంది.
నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా వాయు గుండం వంటివి ఏర్పడకూడదు. ఒకవేళ అలా ఏర్పడినట్లయితే నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. అయితే ఇప్పుడున్న పరి స్థితుల రీత్యా ఈ నెలాఖరులో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ అంశంపై మరికొన్ని రోజులైతే తప్ప ఇప్పడే స్పష్టత ఇవ్వలేమని వారు చెబుతున్నారు. వాస్తవానికి గత ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. అయితే ప్రతికూల పరిస్థితుల కారణంగా జూన్ 8వ తేదీన చాలా ఆలస్యంగా కేరళను తాకాయి. ఒకవేళ జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకితే అక్కడి నుంచి వారం రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయి.
కేరళ తీరం తాకిన తర్వాత ఈ రుతుపవనాలు దేశంలోని అన్నిప్రాంతాలకు విస్తరిస్తాయి. తమిళనాడు, రాయలసీమ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉండదు. ఈ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. గత ఏడాది రెండు వారాల పాటు నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు జూన్ ఆఖరి వారంలో చేరాయి.
నైరుతు రుతుపవనాల వల్ల భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ రుతుపవనాలపై లానినో, ఎల్‌నినో ప్రభావం ఉండడంతో అవి ఆలస్యం కావడం, సక్రమంగా వర్షాలు కురవకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ వర్షపాతం కంటే అధికంగాను లేదా వర్షాభావ పరిస్థితులు తలెత్తడం వంటి సంఘటనలు ఇటీవల అనేకంగా చోటు చేసుకుంటున్నాయి.