CM Revanth Reddy: కలిసికట్టుగా కరువును ఎదుర్కొందాం
ఆన్ లైన్ లో ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి నేరుగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి విడతగా ప్రయోగాత్మకంగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో రూ.97 కోట్లతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అధికారులు, వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవచ్చు. పంటలకు సంబంధించిన సూచనలు, సలహాలు, అధునాతన మెలకువలను ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుంది. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ లో చేపట్టిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కునే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందన్నారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు అవకాశముందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వం రైతులతో కలిసి మెలిసి భవిష్యత్ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఎరువులు, విత్తనాలు పంట వేయడం మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులకు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతామని తెలిపారు. తెలంగాణలో 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందన్నారు. రైతులు కేవలం వరి లేదా పత్తి మిర్చి పంటలకే పరిమితం కావద్దని సీఎం సూచించారు. వరి పంట బదులు ఇతర పంటలు సాగు చేయాలని, దీని ద్వారా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగుచేయాలని సూచించారు.
రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, దీంతో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని గ్రామాలకు విస్తరిస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల భీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. రైతులు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా పథకం ఉంటుందన్నారు. పంట పెట్టుబడి పెట్టినప్పటి నుంచి కరువులు, వరదలు వచ్చినా నష్టపరిహారం అందుతుందన్నారు. రైతు నేస్తం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.