Weather Alert in Telangana : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకండి.. వాతావరణశాఖ హెచ్చరిక
నిజానికి ఇది మార్చి నెలే. ఈ నెల నుంచే ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే.. ఇన్ని రోజులు చూసిన ఎండల కంటే కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో రాబోయే ఎండలు మరింత దారుణంగా ఉంటాయని.. ఈ వేసవిలో ఇవే గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
గత వారం నుంచి కూడా రాష్ట్రంలో వేడి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ.. ఈ వారం రోజులు అంతకుమించి ఎండలు ఉంటాయని తెలిపింది.
Weather Alert in Telangana : కాస్త చల్లబడి మళ్లీ విజృంభించిన వాతావరణం
వేసవిలో ఎండలు ఎక్కువగా మే నెలలో ఉంటాయి. కానీ.. ఈసారి మాత్రం ఎండాకాలం ముందే వచ్చేసిందా అన్నట్టుగా మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల రెండు మూడు రోజులు వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ప్రజలు ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు.
కానీ.. ఇక ఎండలు ఈ వారం రోజుల పాటు విజృంభించనున్నాయి. మామూలు ఉష్ణోగ్రతలతో పోల్చితే ఎక్కువగా నమోదు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా.. ఈ రెండు మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో 35 నుంచి 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని.. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు రెండు మూడు ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా ఎండ తీవ్రత పెరుగుతుంది. అయితే.. దక్షిణ దిశ నుంచి కిందికి గాలులు వీస్తుండటం వల్లనే వచ్చే 5 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే చాన్స్ ఉన్నట్టు వాతావారణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి.
ఈ ఐదు రోజులు దాదాపు అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. ఈ వారం రోజులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఎండలో బయటికి వెళ్లే వాళ్లు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. అత్యవసరం అయితేనే బయటికి వెళ్లాలి. ఎండ నుంచి సంరక్షణ పొందేందుకు గొడుగు కానీ.. తలకు క్యాప్ కానీ పెట్టుకోవాలి.
మజ్జిగ తాగడం, నిమ్మరసం తాగడం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చేస్తూ ఉంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. గొంతు తడి ఆరిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటేనే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఎండ వేడి ఎక్కువగా ఉన్న సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటేనే ఎండ వేడి నుంచి అందరూ బయటపడే చాన్స్ ఉంటుంది. లేకపోతే ఎండ వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.